Топ-100
Back

ⓘ ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం., మండలం, ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. పిన్ కోడ్: 534 4 ..




ద్వారకా తిరుమల
                                     

ⓘ ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం., మండలం, ఏలూరు నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న పుణ్య క్షేత్రము. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా భీమడోలు, వయా తడికలపూడి, వయా దెందులూరు - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.

.

                                     

1. పేరు వెనుక చరిత్ర

ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతి గా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు. "పెద్దతిరుపతి" తిరుమల తిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.

.

ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు, దారువులుచెట్లు ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది. తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.

                                     

2. ఆలయ చరిత్ర

ప్రస్తుతము ఉన్న గుడిని, విమానము, మంటపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమిందార్ ధర్మా అప్పారావు 1762-1827 కాలంలో కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు 1877-1902 సమర్పించారు.

.

స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ, ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో తొలిపమెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారముల విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.

ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన లోపల సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలు ధ్వజస్తంభం వెనుక ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.

ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్తులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్ఠింపబడ్డాయి. పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.

పుష్కరిణి

గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199లో పుష్కరిణి మధ్య మడపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.

కేశఖండన మొక్కు విధానం: ద్వారకాతిరుమలను దర్శించిన భక్తులు తలనీలాలు తల వెంట్రుకలు మొక్కుగా సమర్పించడం ఞక ఆనవాయితీగా వస్తున్నాది. వెంకటేశ్వరుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమజీవనం గడుపుతున్నప్పుడు. తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్య కన్య యువరాణి అయిన నీలాదేవి తన అపురూపమైన కొప్పునుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్ధం భక్తులు ఇచ్చే మొక్కుకాబట్టి తల నీలాలు అంటారట. అట్టి మొక్కు తీచ్చుకునే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు.

                                     

2.1. ఆలయ చరిత్ర ఆలయంలో సమస్యలు, లోపాలు

  • నూతనముగా నిర్మించిన కేశఖండనశాల భవనము ఆలయమునకు దూరముగా ఉండటము, రోడ్డుకు అవతలివైపు ఏర్పాటు చేయుటవలన చాలా ప్రమాదకరము.
  • తగినన్ని సైన్ బోర్డులు ముఖ్య ప్రదేశములలో ఏర్పాటుచేయకపోవటము.పాదచారులకు footpath వెంబడి sheds వేయకపోవటం ఎండలో,వానలో చాలాఇబ్బంది
                                     

3. అర్చన, కైంకర్యం, ఉత్సవాలు

  • ఉగాది ఉత్సవం - చైత్రమాసం ఉగాదికి - ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానము
  • గోదా కళ్యాణం - పుష్యమాసం - భోగి నాడు-, తిరువీధి సేవ
  • తిరుకళ్యాణోత్సవాలు - వైశాఖమాసం శుద్ధ దశమి నుండి నిదియ వరకు, ఆశ్వయుజమాసం విజయ దశమి నుండి విదియ వరకు - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం వంటివి
  • పవిత్రోత్సవాలు - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
  • విశేష ఉత్సవాలు - ప్రతినెల ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో- రాత్రి 7:30కి విశేష ఉత్సవం - ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం
  • శ్రీరామనవమికి శ్రీసీతారామకళ్యాణం, కృష్ణాష్టమికి ఉట్లపండుగ
  • మాఘ మాసం రధ సప్తమి, ఫాల్గుణ మాసం డోలా పౌర్ణమి దినాలలో విశేషముగా తిరువీధి సేవలు జరుగును.
  • నిత్య కార్యక్రమాలు - సుప్రభాతం, తీర్ధపు బిందె, ప్రాతఃకాలార్చన, బాలభోగము, గోష్ఠి, ప్రత్యేక దర్శనము 06:00 నుండి 13:00, అర్జిత పూజలు, వేద పారాయణము, మహా నివేదన 12:00, విరామం 13:00 నుండి 15:00 వరకు దర్శనం ఉండదు, ప్రభుత్వోత్సవము, సర్వ దర్శనము 15:00 నుండి 17:00 వరకు, పంచాంగ శ్రవణము, ప్రత్యేక దర్శనము 17:00 నుండి 21:00 వరకు, సాయంకాలార్చన, సేవాకాలము, పవళింపు సేవ, ఏకాంతసేవ తీర్మానము 21:00
  • గిరి ప్రదక్షిణము - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
  • తెప్పోత్సవం - కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి నాడు - సుదర్శన పుష్కరిణిలో * అధ్యయన ఉత్సవాలు - మార్గశిరమాసం - ధనుర్మాసం నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం, రాత్రి తిరువీధి సేవ.


                                     

4. ఇతర ఆలయాలు

భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం: కొండపైన ప్రధానాలయానికి వాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజమ్ డిపార్ట్‌మెంటు వారి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

కుంకుళ్ళమ్మ రేణుకా దేవి ఆలయం: కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోల నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు: ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ ఒడిషాకి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు. కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. పుష్కరిణి మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఉగాది మండపం ఎదురుగా రామాలయం ఉమ్మది.

                                     

5. చూదదగిన ప్రదేశాలు

  • భ్రమారంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. పుష్కరిణి మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
  • భీమడోలువద్ద స్వామివారి నమూనా ఆలయం ఉంది.
                                     

6. వసతి విశేషాలు

  • దేవస్థానము వారికి చెందిన కొండపైన గల విశాలమైన డార్మిటరీ నందు రూ. 20/- లు చెల్లించి వసతి పొందవచ్చును. ఇతర వివరముల కొరకు దేవస్థానము వారి ఫోన్ నెంబర్: 08829 271436, 08829271427 కు ఫోన్ ద్వారా తెలుసుకొనవచ్చును.
  • కొండపైన శ్రీ ధర్మ అప్పారాయ నిలయమునందు 120 గదులు A.C, NON-A.C, సూటు రూములు కలవు. బస్ట్ స్టాండ్ దగ్గరలో దేవస్థానమునకు చెందిన ఆళ్వార్ సదనమునందు సామాన్య జనులకు రూ. 100/-లు చెల్లిస్తే చాలు రూము లభించును. దాని ప్రక్కనే TTD చౌల్ట్రీ నందు A.C, NON-A.Cరూములు కలవు. విశాలమైన పార్కింగ్ సదుపాయము కలదు.
  • పద్మావతి అతిథి గృహం, అండాళ్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టి.టి.డి. అతిథి గృహం, ధర్మ అప్పారాయ నిలయమునందు 120 గదులు వంటి వసతి గృహాలు దేవస్థానంచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలున్నాయి.
  • వివాహాది శుభకార్యముల కొరకు కల్యాణ మండపములు కావలసినవారు తూర్పుగాలిగోపురము ప్రక్కనే ఉన్న దేవస్థానము వారి CRO/PRO ఆఫీసు నందు సంప్రదించవచ్చును. కల్యాణ మండపములు కావలసినవారు ముందుగా వచ్చి లగ్న పత్రిక మరియు ఆధార్ గుర్తింపుకార్డు చూపి వారికి వీలుగా ఉండే కల్యాణ మండపములను చూసి ముందుగా బుక్ చేసుకొనేసదుపాయము కలదు. ఇతర వివరముల కొరకు దేవస్థానము వారి ఫోన్ నెంబర్: 08829 271436, 08829271427 కు ఫోన్ ద్వారా తెలుసుకొనవచ్చును.


                                     

7. ప్రయాణ సౌకర్యాలు

  • ద్వారకా తిరుమలనుండి లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.
  • ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులున్నాయి.
                                     

8. సంప్రదింపుల వివరాలు

  • సంప్రదించడానికి వెబ్ సైటు www.dwarakatirumala.org, ఇ-మెయిల్ eo_dwarakatirumala yahoo.co.in
  • పోస్టల్ చిరునామా: కార్యనిర్వహణాధికారి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్- 534 426, ఫోన్: 08829 271427, 271469, 271436
                                     

9. దత్తత ఆలయాలు

  • మైలవరం దేవాలయాలు, మైలవరం, కృష్ణా జిల్లా - శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు -
  • శ్రీ కోదండరామస్వామి దేవాలయం, నాగులూరు, రెడ్డిగూడెం మండలం, కృష్ణా జిల్లా: ఈ గ్రామాన్ని మైలవరం జమీందారులు నూరానేని వంశీయులు నిర్మించారు.
  • శ్రీరామ, శ్రీ వెంకటెశ్వర స్వామి వారి దేవాలయము, భట్ల మగుటూరు, పెనుమండ్ర మండలం
  • శ్రీ భూనీళా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం - రంగాపురం లింగపాలెం - ద్వారకా తిరుమలకు 42 కి.మీ. దూరంలో ఉంది.
  • శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, తూర్పు యడవల్లి: ద్వారకా తిరుమలకు 7 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని మరొక భద్రాద్రిగా భక్తులు వర్ణిస్తున్నారు.
  • శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, శనివారపు పేట, ఏలూరు సమీపంలో, నూజివీడు దారిలో - నూజివీడు జమీందారులచే నిర్మింపబడింది. ఈ ఆలయం గాలిగోపురం చాలా పెద్దది, చక్కని శిల్పాలతో అలరారుతున్నది.
  • శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఐ.ఎస్.జగన్నాధపురం
                                     

10. కార్యక్రమాలు, పధకాలు, సంస్థలు

  • నిత్య అన్నదాన ట్రస్ట్ - భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం కోసం
  • శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల - 1890లో మొదలయ్యింది. సుమారు 100 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య, భోజన వసతి సౌకర్యాలు లభిస్తాయి. ప్రస్తుతం "ప్రవేశ", "వర", "ప్రవర" అనే తరగతులున్నాయి.
  • సంస్కృతోన్నత పాఠశాల - 1960లో ప్రారంభించారు.
  • శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలు - భీమడోలు, కామవరపుకోట
  • గో సంరక్షణ పధకము
                                     

11. మండలంలో వ్యవసాయం, నీటి వనరులు

ఈ మండలంలో వ్యవసాయం ప్రధానంగా మెరక వ్యవసాయం. చెరువులు, భూగర్భ జలాలు ముఖ్యమైన నీటి వనరులు. పుగాకు, మామిడి, నిమ్మ, పామాయిల్, సపోటా, ప్రొద్దు తిరుగుడు, అపరాలు, జీడిమామిడి వంటి తోటలు అధికంగా ఉన్నాయి. చెరువుల క్రింద కొంత వరి వ్యవసాయం జరుగుతున్నది.

                                     

12. మండలంలో ఆర్ధిక వ్యవస్థ

ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. వ్యవసాయాధారిత వ్యాపారము, పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సెరామిక్ పరిశ్రమలకు పనికొచ్చే బంకమన్ను లభిస్తుంది. అందువలన ద్వారకా తిరుమల పరిసరాలలో పెంకులు, రిఫ్రాక్టరీ ఇటుకలు, సెరామిక్ టైల్స్ పరిశ్రమలు ఉన్నాయి. వరి పండే ప్రాంతాలలో బియ్యం మిల్లులున్నాయి.