Топ-100
Back

ⓘ తెలుగు సినిమా బిరుదులు. తెలుగు సినిమా రంగంలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రకరకాల బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని బిరుదులు అధికారిక సంస ..




                                     

ⓘ తెలుగు సినిమా బిరుదులు

తెలుగు సినిమా రంగంలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రకరకాల బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని బిరుదులు అధికారిక సంస్థల ద్వారా ఇవ్వబడతాయి. కొన్ని బిరుదులు అధికారికంగా కాకపోయినా విస్తృతమైన గుర్తింపు ఉన్న సంస్థలు ఇవ్వవచ్చును. కాని చాలా బిరుదులు జనబాహుళ్యంనుండి, ప్రత్యేకించి "అభిమానుల" నుండి లభిస్తాయి. గమనించ దగిన విషయం ఏమంటే ఇలా అభిమానులనుండి లభించిన బిరుదులు అధికారికలాంఛనాలకంటే ఎక్కువ ఆదరణ పొందాయి.

                                     

1. బిరుదులు ఎందుకు ఇస్తారు?

బిరుదులు ఇవ్వడం అనేది తెలుగు సంస్కృతిలో ఒక విశిష్టమైన సంప్రదాయం కావచ్చును. ఈ విషయంపై ఎన్నో జోకులు, వ్యంగ్య నాటికలు కూడా ఉన్నాయి. కాని అనాదిగా తాము అభిమానించేవారిని తెలుగువారు చక్కని బిరుదులతో సత్కరించారు. నన్నయను "ఆదికవి", "వాగనుశాసనుడు" అన్నారు. శ్రీకృష్ణదేవరాయలును "ఆంధ్రభోజుడు" అన్నారు. ఆదిభట్ల నారాయణదాసును "హరికథాపితామహుడు" అన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రిని "కరుణశ్రీ" అన్నారు. ప్రస్తుత కాలంలో సినిమా అత్యంత జనాదరణ పొందిన రంగం గనుక సినిమారంగంలో బిరుదులకు మంచి అవకాశం, ప్రోత్సాహం లభించాయి.

ఎవరికైనా ఈ బిరుదులు ఇచ్చినపుడు వారి ప్రతిభను, వారి వృత్తిని వారి పేరుకు అనుసంధించినట్లవుతుంది. ప్రజాదరణ లేనిదే ప్రతిభకు గుర్తింపులేదు గనుక ఈ విధమైన బిరుదులు ఇచ్చినవారికీ, తీసుకున్నవారికీ గుర్తింపు తెస్తాయి.

ఈ విధమైన సంస్కృతి ఆంగ్ల, హిందీ సినిమా రంగాలలో కనిపించదు. దక్షిణభారత సినిమాకు ఇది ఒక విశిష్టమైన సంప్రదాయం అనిపిస్తుంది.

                                     

2. అధికారిక, అనధికారిక బిరుదులు

ప్రభుత్వపరంగా ఇచ్చే "పద్మశ్రీ", "పద్మవిభూషణ" వంటి బిరుదులు, "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు", "రఘుపతి వెంకయ్య అవార్డు" వంటి పురస్కారాలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చే "డాక్టరేటులు" - ఇవి అధికారికమైన బిరుదులు.

ఇక "రాజారెడ్డి ఫౌండేషన్", "వంశీ బర్క్‌లీ", "ఫిల్మ్‌ఫేర్" వంటి బాగా గుర్తింపు పొందిన సంస్థలు ఇచ్చే బిరుదులు రెండవకోవకు చెందినవి.

సామాన్యమైన ప్రజలు ఇచ్చేవి మూడవ కోవకు చెందినవి. ఇలాంటి సన్మానాలకు, బిరుదులకు ప్రత్యేకించి విధివిధానాలు, అర్హతలు, ఎన్నిక నియమాలు ఉండవు. ఎవరి పద్ధతులు వారివి. ఎవరి గుర్తింపు వారిది. కనుక ఈ విధమైన బిరుదుల గురించి కొంత చులకనగా మాట్లాడడం అప్పుడప్పుడూ జరుగుతుంది. ఎవరైనా ఎవరికైనా తమకిష్టమైన బిరుదులు ఇచ్చుకోవచ్చు గదా? మరి ఇక ఆ బిరుదులకు విలువ ఏమిటి? అని అంటారు.

కాని నిశితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలను అంగీకరించవలసి వస్తుంది. సినిమాలాగానే బిరుదులు కూడా పూర్తిగా ప్రజాదరణపై ఆధారపడిన విషయాలు. కనుక నటీనటులకు కొన్ని బిరుదులు మాత్రమే చిరస్థాయిగా నిలచిపోయాయి. నిజానికి ప్రభుత్వాలు ఇచ్చిన పురస్కారాలకంటే ఈ విధమైన బిరుదులే ఆయా వ్యక్తుల పేర్లతో అవినాభావంగా కలిసిపోయాయి. ఇదంతా ఒకవిధంగా పూర్తి "ప్రజాస్వామ్య విధానం" అని చెప్పవచ్చును.

అంతేకాదు. కొందరు నటులకు వారు పోషించిన కొన్ని పాత్రలు, వారు చెప్పిన కొన్ని డైలాగులు శాశ్వతంగా వారి పేరుతో కలిసి నిలిచిపోతాయి. వీటిని కూడా బిరుదులు అనవచ్చును ఎందుకంటే అవి వారి వృత్తికీ, ప్రతిభకూ అందం తెచ్చే ఆభరణాలు గనుక.