Топ-100
Back

ⓘ సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము లోని నదీస్తుతిలో చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ నది ఉన్నాయి. ఆ తరువ ..
సరస్వతీ నది
                                     

ⓘ సరస్వతీ నది

సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము లోని నదీస్తుతిలో చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ నది ఉన్నాయి. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. సింధు లోయ నాగరికత కాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా నది ప్రాంతములలో లభించినాయి. ప్రస్తుతము సరస్వతి అనే పేరుమీద ఓ చిన్న నది ఉంది. ఇది ఘగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు.

సరస్వతీ దేవి మొదట్లో ఈ నదీదేవతా మూర్తిగానే ప్రారంభమైంది, అయితే తర్వాతి కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది. హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగానూ, గంగా-యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందనీ భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని, వైదిక సరస్వతీ నది ఒకటేనని, మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారనీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సీరీస్‌కి సంపాదకుడు అయిన మైఖేల్ విజెల్ భావించాడు.

ఋగ్వేదంలోనూ, తర్వాతి వేదాల్లోనూ ప్రస్తుత కాలంనాటి నదులు, ప్రాచీన నదులను స్తుతించడం కనిపిస్తుంది. ఋగ్వేదంలోని నదీస్తుతి మంత్ర భాగం సరస్వతీ నదిని తూర్పున యమున, పశ్చిమాన సట్లెజ్ శతధృ నడుమ ఉన్నట్టు వర్ణించింది. తర్వాతి వేద పాఠ్యాలైన తాంద్య, జైమినీయ బ్రాహ్మణాలు, మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టు ప్రస్తావించాయి.

19వ శతాబ్ది తుదికాలం నుంచి పరిశోధకులు వైదిక సరస్వతీ నది ఇప్పటి వాయువ్య భారతదేశంలోనూ, తూర్పు పాకిస్తాన్‌లోనూ ప్రవహిస్తున్న ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థలోనిదని భావించసాగారు. శాటిలైట్ తీసిన చిత్రాలు సరస్వతీ నదీ గమనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి, ఆ నది ఇప్పటి ఘగ్గర్ నదీ గమనాన్ని అనుసరించేది. సింధులోయ నాగరికత విలసిల్లిన రాజస్థాన్‌లోని కాలిబంగన్, హర్యానాలోని బనవాలీ, రాఖీఘరి, గుజరాత్‌లోని ధోలవిరా, లోథాల్ ఈ నదీపరీవాహక ప్రాంతంలోనే ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు.

ఐతే, ఘగ్గర్-హక్రా ఋగ్వేదంలో ప్రత్యేకించి ప్రస్తావింపబడివుండడం, అదీ వేదకాలానికి ఎండిపోయిన నదిగా దాని ప్రస్తావన రావడంతో వైదిక సరస్వతీ నదిని ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థలో గుర్తించడం సమస్యాత్మకమైనది. అన్నెట్ విల్కె మాటల్లో - వైదిక ప్రజలు వాయువ్య భారతదేశంలోకి వలసవస్తున్న కాలానికి ఘగ్గర్-హక్రా, ఎడారిలో చిన్న ప్రవాహం అయిపోయింది. ఇటీవలి భూభౌతికశాస్త్ర పరిశోధనలు ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థ, వర్షాకాలంలో వర్షపునీటితో నిండే నదుల వ్యవస్థ అనీ, వాతావరణ మార్పుల వల్ల నదులు ఇంకిపోతూండడంతో సింధులోయ నాగరికత దెబ్బతినిపోయివుండవచ్చనీ సూచిస్తున్నాయి. 4వేల ఏళ్ళ క్రితం ఆ నాగరికత అంతమవుతూన్నప్పుడే ఈ నదులకు నీటినిచ్చే వర్షరుతువు దెబ్బతినడం మొదలైంది.

దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మండ్ లేదా హరాక్షవతి నది అయివుండవచ్చని కూడా భావిస్తున్నారు. వైదిక జాతి తర్వాత పంజాబ్‌కు చేరినప్పుడు హరాక్షనదికి వాడిన సంస్కృత పదాన్నే ఘగ్గర్-హక్రా నదికి కూడా వాడారని అంచనావేస్తున్నారు. ఋగ్వేదపు సరస్వతీ నది అన్నది రెండు వేర్వేరు నదులను సూచిస్తోందనీ, ఒక గ్రంథం హెల్మండ్ నదినీ, మరీ ఇటీవల నాటి 10వ మండలం ఘగ్గర్-హక్రానీ సూచిస్తూండవచ్చన్నారు.

కొందరు ఋగ్వేదాన్ని మరింత ప్రాచీనమైనదిగా చెప్తూ, సింధునదీ నాగరికతను "సరస్వతీ సంస్కృతి", "సరస్వతీ నాగరికత", "సింధు-సరస్వతీ నాగరికత", "ఇండస్-సరస్వతీ నాగరికత"గా పేర్లు మారుస్తూండడంతో, 21వ శతాబ్దిలో ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థతో గుర్తించడం కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది సింధు-సరస్వతీ నాగరికతగా ఈ నాగరికతకు పేరు మారుస్తున్న పరిశోధకులు, సింధు లోయ నాగరికత, వైదిక సంస్కృతీ ఒకటేనంటూ ఆర్య దండయాత్ర సిద్ధాంతం లేదా ఆర్యుల వలస సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు.

                                     

1. ప్రాముఖ్యత

హిందూత్వంలో సరస్వతీ నదికి పూజార్హత, ప్రాముఖ్యత ఉంది. వైదిక సంస్కృతం, ఋగ్వేదం తొలిభాగం, పలు ఉపనిషత్తులు వంటి ముఖ్యమైన వైదిక సాహిత్యం వంటివాటికి జన్మస్థానమైన బ్రహ్మావర్తం అనే వైదిక ప్రాంతం సరస్వతీ నది, దాని ఉపనది దృషద్వతిల ఒడ్డున ఉండేదని చెప్తారు. మనుస్మృతిలో, స్వచ్ఛమైన వైదిక సంస్కృతికి బ్రహ్మావర్తం కేంద్రం అని పేర్కొనివుంది. ద రైజ్ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అన్న గ్రంథంలో బ్రిడ్జెట్, రేమండ్ అల్చిన్ - "ఋగ్వేద కాలం నాడు భారత, పాకిస్తాన్‌లలో మొట్టమొదటి ఆర్యభూమి పంజాబ్‌లో సరస్వతీ, దృషద్వతీ నదుల లోయల్లో ఉండేదన్న" భావన వెల్లడించారు.

2015లో వేదనది భౌతిక ఉనికి ఋజువయ్యాకా, ముస్లిం, క్రైస్తవ దండయాత్రలకు ముందు హిందూ భారతదేశం స్వర్ణయుగం అనుభవించిందన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వారి భావనను బలపరుస్తోందంటూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం పురావస్తు శాస్త్రవేత్తలను పురాతన సరస్వతీ నది ఆనవాళ్లను అన్వేషించమని ఆదేశించింది.

                                     

1.1. ప్రాముఖ్యత ఋగ్వేదము

ఋగ్వేదపు నాలుగవ భాగంలో తప్ప మిగతా అన్ని భాగాల్లోనూ సరస్వతీ నదీ ప్రస్తావన, ప్రశంస కనిపిస్తాయి. సరస్వతీ నదికి సంబంధించిన అతి ముఖ్యమైన శ్లోకాలు ఋగ్వేదం 6.61, ఋగ్వేదం 7.95, ఋగ్వేదం 7.96 లలో ఉన్నాయి.

ఋగ్వేదము లో సరస్వతీ నది ప్రముఖముగా చెప్పబడింది. మొత్తం అరవై పర్యాయాలు ఉదాహరణకు: 2.41.16; 6.61.8-13; 1.3.12. ఈ సరస్వతీ నది ప్రస్తావనకు వస్తుంది. ఈ నది ఏడు పుణ్య నదులలో ఒకటి. భాషా పరంగా సరస్వతి అనగా అనేక పాయలతో ప్రవహించు నది అని అర్థము. ప్రస్తుతము చాలామంది పండితులు, గఘ్ఘర్-హక్రా నదే సరస్వతీ నదిగానో, లేదా కనీసం ఓ పాయగానో ఒప్పుకుంటారు, కానీ ఈ పేరు ఆఫ్ఘనిస్తాను నుండి పంజాబుకు వెళ్ళినదా లేదా పంజాబునుండి ఆఫ్ఘనిస్తానుకు వెళ్ళినదా అనే విషయముపై భిన్నాభిప్రాయాలున్నాయి.

अम्बितमे नदीतमे देवितमे सरस्वती अपरास्तस्य इव स्मासि प्रशस्तिम् अम्ब नास्कृतिम् అంబితమే నదీతమే దేవితమే సరస్వతీ అపరాస్తస్య ఇవ స్మాసి ప్రశస్తిం అంబ నాస్కృతిమ్

ఋగ్వేదములో సరస్వతీ నదిని అన్నింటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించారు. దీనిని ఏడవ నదిగా, వరదలకు తల్లిగా, గొప్ప తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించారు. ఋగ్వేదము 2.41.16-18;, 6.61.13; 7.95.2 ఋగ్వేదము: 7.36.6. సరస్వతి సప్తః సింధుం", 2.41.16 లో ఆంబితమే నదీతమే దేవితమే సరస్వతీ" ॥ దీనిని బట్టి సరస్వతీనది ప్రాముఖ్యత అర్థము అవుతుంది. ఋగ్వేదము 7.95.1-2 లో సరస్వతీ నదిని సముద్రమువైపు ప్రయాణము చేసే నదిగా కీర్తించారు.

                                     

1.2. ప్రాముఖ్యత దేవతగా సరస్వతి

ఋగ్వేద శ్లోకాలలో సరస్వతి పేరు యాభై సార్లు ప్రస్తావించబడింది. ఈ పేరు ఋగ్వేదపు చివరి భాగాల్లోని పదమూడు శ్లోకాలలో 1, 10 ప్రస్తావించబడింది. ఈ ప్రస్తావనల్లో రెండింటి విషయంలో మాత్రమే సరస్వతిని నదిగా సూచిస్తూన్నాయి. హిందువులు సరస్వతిని ఒక దేవతగా సరస్వతీ నదికి నేరుగా సంబంధం లేకుండానే ప్రార్థిస్తారు.

దివ్య జలాలను రక్షించే నదీ దేవత అని సరస్వతి ఆవిర్భావం గురించి ఋగ్వేదంలోని ఒక శ్లోకంలో ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలోని 10.135.5 శ్లోకంలో ఇంద్రుడు సోమరసం తాగాడని చెప్తూ, అతనికి సరస్వతి అలసట పోగొట్టి, తిరిగి శక్తి ప్రసాదించిందని ఉంది. 10.17 మంత్రాల్లో సరస్వతిని పూర్వుల దేవతే కాక ప్రస్తుత తరానికి కూడా దేవత అని ప్రస్తావించారు. 1.13, 1.89, 10.85, 10.66, 10.141ల్లో ఆమెను నదుల సరసన కాక, ఇతర దేవీదేవతల సరసన చేర్చారు. 10.65 మంత్రభాగంలో ఆమెను పవిత్ర భావనలు dhī దాతృత్వం puraṃdhi వంటి గుణాల కోసం ఆవాహన చేశారు.

వైదిక గ్రంథాల్లో మొదట సరస్వతిని నదీ దేవతగా భావించినా, పురాణాల నాటి హిందూ మతంలో ఆమెను నదీ దేవతగా అత్యంత అరుదుగా సంభావించారు. అందుకు బదులుగా ఆమె జ్ఞానాన్ని, విద్యనీ, మేధస్సును, సంగీతాన్ని, కళలను ప్రసాదించే దేవత అయింది. నదీ దేవతగా ప్రారంభమైన సరస్వతి జ్ఞానానికి అధిదేవతగా మారడం బ్రాహ్మణాల తో ప్రారంభమైంది. ఈ బ్రాహ్మణాలు ఆమెను వాక్కుకు అధిదేవతగా వాగ్దేవి గా పేర్కొన్నాయి, నదీ తీరంలోని వైదిక జాతి అభివృద్ధికి వాక్కు ప్రధానమైన కారణం కావడంతో నదీదేవతను వాక్కుకు అధిదేవత చేశారని కూడా భావిస్తున్నారు. ఐతే ఇద్దరు స్వతంత్రమైన దేవతలు ఒకే పేరుతో ప్రారంభమై తర్వాతి వేదాల నాటికి ఒకే దేవతగా రూపాంతరం చెందివుండనూ ఉండొచ్చు.

మరోవైపు అరబిందో "వేదాల సంకేతాత్మకత సరస్వతీ దేవి రూపం గురించిన స్పష్టత విషయంలో తనను తానే మోసగించుకుంటుంది. ఆమె నిర్మలంగా, స్పష్టంగా ప్రపంచపు దేవత, దివ్యత్వం స్ఫూర్తితో వచ్చిన దేవత." అని ప్రతిపాదిస్తాడు.                                     

1.3. ప్రాముఖ్యత మహాభారతం

మహాభారతం ప్రకారం, సరస్వతి నది ఎడారిలో వినాశన లేదా ఆదర్శన అనే ప్రదేశంలో ఎండిపోయింది. ఎడారిలో అదృశ్యమైన తరువాత, కొన్ని ప్రదేశాల్లో తిరిగి కనిపిస్తుంది. చివరికి సముద్రంలో "అనిశ్చితంగా" చేరుతుంది. సరస్వతీ నది ఎండిపోయిన ప్రదేశం థార్ ఎడారి. ఈ ప్రదేశాన్ని కురుప్రదేశ్ లేక కురు రాజ్యం అంటారు, సరస్వతీ నదికి దక్షిణాన, దృషద్వతికి ఉత్తరాన నెలకొనివుండేది. రాజస్థాన్, హర్యానాల్లోని ఎండిపోయిన వర్షాధారిత నది ఘగ్గర్ మహాభారతంలో అభివర్ణించిన భౌగోళిక స్థితిగతుల్లోనే ఉంది.

మహాభారతంలో ద్వారక నుంచి మథుర వరకు బలరాముడు సరస్వతీ నది ఒడ్డునే తీర్థయాత్రికునిగా ప్రయాణించినట్టు ఉంది. ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలోని మహాజనపదాల్లో ప్రాచీన సామ్రాజ్యాలు కొన్నిటిని సరస్వతీ నది పేరుమీదుగా వ్యవహరించారు.

                                     

1.4. ప్రాముఖ్యత పురాణాలు

పలు పురాణాలు సరస్వతి నదిని వర్ణించాయి, ఈ నది సరస్సులు సారాస్ గా విభజింపబడిందనీ స్పష్టంగా నమోదు చేశారు. స్కంద పురాణం ప్రకారం సరస్వతి బ్రహ్మ నీటి కుండ నుండి ఉద్భవించి, హిమాలయాలపైనున్న పిప్పల వృక్షం మీద నుంచి ప్రవహిస్తుంది. ఇది కేదారం వద్ద పశ్చిమదిశకు తిరిగి, అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తుంది. ఇందులోనే సరస్వతీ నది ఐదు శాఖలను పేర్కొన్నారు. ఈ పాఠ్యం సరస్వతిని బ్రహ్మ భార్య బ్రాహ్మిగా చిత్రీకరించింది. వామన పురాణం ప్రకారం 32.1-4, సరస్వతి నది పిప్పల వృక్షం నుంచి పెరిగింది.

                                     

1.5. ప్రాముఖ్యత స్మృతులు

మను స్మృతి ప్రకారం, వరదల నుండి తప్పించుకున్న సాధువు మనువు సరస్వతి, దృషద్వతి నదుల మధ్య వేద సంస్కృతిని స్థాపించాడు. ఈ సరస్వతి నది బ్రహ్మవర్తానికి పశ్చిమ సరిహద్దుగా ఉందనీ, "సరస్వతి, దృషద్వతి మధ్య ఉన్న భూమి దేవుని సృష్టి అయిన బ్రహ్మావర్తం." అనీ మనుస్మృతిలో పేర్కొన్నారు.

వశిష్టుని ధర్మ సూత్రాల్లోని I.8-9, 12-13 శ్లోకాలు ఆర్యావర్తాన్ని సరస్వతీ నది ఎడారిలో అదృశ్యమైన ప్రాంతానికి తూర్పున, కలకవానాకు పశ్చిమాన, పరియాత్రా, వింధ్య పర్వతాలకు ఉత్తరాన, హిమాలయాల దక్షిణాన ఉన్నట్టు ప్రస్తావిస్తున్నాయి. పతంజలి మహాభాష్యం కూడా ఆర్యావర్తాన్ని వశిష్టుని ధర్మ సూత్రాల్లానే వర్ణించింది.

బౌద్ధయానా ధర్మసూత్రాలు ఆర్యావర్తం అంటే కలకవానాకు పశ్చిమాన, సరస్వతీ నది అదృశ్యమైన ఎడారి అయిన ఆదర్శనకి తూర్పున, హిమాలయాలకు దక్షిణాన, వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమి అని ప్రకటించారు.

                                     

2. గుర్తింపు సిద్ధాంతాలు

భౌతిక నదులతో వైదిక, పౌరాణిక నది అయిన సరస్వతిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయి. వేద సరస్వతి నది సింధు నదికి తూర్పున ప్రవహించేదని అనేకమంది భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పరిశోధకులు సరస్వతి నదిని ప్రస్తుతమున్న లేదా గతంలో ప్రవహించిన నదులలో గుర్తించారు.

సరస్వతిని గుర్తించే ప్రయత్నంలో రెండు సిద్ధాంతాలు ప్రాచుర్యం పొందాయి. అనేకమంది పరిశోధకులు ఈ రోజున ఘగ్గర్-హక్రా నది సరస్వతీ నది అయినా అయివుండాలి లేదా అది సరస్వతీ నది ఎండిపోయిన ప్రాంతంలోనిది అయినా అయివుండాలని భావిస్తున్నారు. ఇది వాయువ్య భారతదేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ ప్రవహిస్తోంది. ప్రసిద్ధి పొందిన సిద్ధాంతాల్లో రెండోదాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మాండ్ నది సరస్వతీ నది అయివుండొచ్చు, లేదా ప్రస్తుతపు హెల్మండ్ లోయలో ప్రాచీన కాలంలో సరస్వతీ నది ప్రవహించి ఇంకిపోయివుండవచ్చు. ఇతరులు సరస్వతీ నదిని ఒక కల్పిత నదిగా భావిస్తున్నారు.

ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థగా సరస్వతీ నదిని గుర్తించడానికి 21వ శతాబ్దిలో కొత్త ప్రాముఖ్యత లభిచింది. ఇంతవరకూ ఋగ్వేద కాలం క్రీ.పూ.1500గా గుర్తిస్తూండగా, ఋగ్వేద కూర్పు అంతకన్నా ప్రాచీన కాలంలో జరిగిందని ప్రతిపాదిస్తూ, సింధులోయ నాగరికతను "సరస్వతీ సంస్కృతి", "సరస్వతీ నాగరికత", "సింధు-సరస్వతీ నాగరికత" వంటి పేర్లు పెట్టి, దేశీయ ఆర్యులు అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం సింధులోయ నాగరికత, వైదిక సంస్కృతీ వేర్వేరు కావు, రెండూ ఒకే నాగరికతకు చెందినవి. ఈ సిద్ధాంతం ఆర్యదండయాత్ర సిద్ధాంతాన్ని, ఆర్యుల వలస ప్రతిపాదననూ తిరస్కరిస్తోంది.                                     

2.1. గుర్తింపు సిద్ధాంతాలు నది ఉనికికి బలమైన ఆధారం

ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధుశాఖ రాన్ ఆఫ్ కఛ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మొత్తం పొడవు సుమారు 1.600 కిలోమీటర్లు. ఈ మార్గంలో చాలా ప్రాంతాలలో ఓ.ఎన్.జి.సి. భూగర్భ జలాల నిల్వలను కనుగొంది. రాజస్థాన్ లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13 చోట్ల బోరుబావులు తవ్వగా 35-40 మీటర్ల లోతున నీటి నిల్వలు లభించాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు 4 వేల సంవత్సరాల నాటిదని గుర్తించారు. ఈ ఆధారాలతో సరస్వతీ నది పరీవాహక ప్రాంతం హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలుగా పరిశోధకులు భావిస్తున్నారు.

                                     

2.2. గుర్తింపు సిద్ధాంతాలు ఎండిపోవడం, వేదాల కాలనిర్ణయం

సరస్వతీ నది ఎండిపోవడం గురించి వైదిక, పౌరాణిక సాహిత్యంలోని వివరాలు హరప్పా నాగరికతకు, వైదిక సంస్కృతికి కాలనిర్ణయం చేసేందుకు ఒక ఆధారంగా ఉపయోగిస్తున్నారు. క్రీ.పూ.1500లో ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని చెప్పే ఆర్యుల వలస లేక ఆర్యదండయాత్ర సిద్ధాంతాన్ని ఈ పాఠ్యం తిరస్కరిస్తూ ఋగ్వేదం మరింత ప్రాచీన కాలం నాటిదని నిరూపించే ఆధారంగా ఈ పాఠ్యాలను కొందరు గ్రహించారు.

చరిత్రకారుడు, ఆచార్యుడు మైఖేల్ డానినో సంప్రదాయికంగా చరిత్రకారులు ఋగ్వేదం కూర్చిన కాలంగా భావిస్తున్న క్రీ.పూ.15వ శతాబ్దికి మూడు వేల ఏళ్ళ క్రితం అసలు ఋగ్వేదం కూర్చిన కాలమని భావిస్తున్నారు. ఋగ్వేదాల్లోని ప్రస్తావనలు వాస్తవమైన వివరాలని అంగీకరిస్తూనే సరస్వతీ నది క్రీ.పూ.3వ సహస్రాబ్ది తుదికాలంలో ఇంకిపోయిందని భావించడం ఒకదానికొకటి పొంతన లేనివని డానినో ఎత్తిచూపారు. డానినో ప్రకారం, ఉత్తర భారతదేశంలో క్రీ.పూ.3వ సహస్రాబ్దిలో వైదిక ప్రజలు జీవించారన్నది కొందరు భారతీయ పురాతత్వశాస్త్రవేత్తల నిర్ధారణే తప్ప పాశ్చాత్య శాస్త్రవేత్తల దీన్ని నిర్ధారించడం లేదు. క్రీ.పూ.2వ సహస్రాబ్ది కాలంలో ఏ ఆగంతుక, చొరబాటుదారుల సంస్కృతి భారతదేశపు వాయువ్యప్రాంతంలో లేదనీ అస్థి అవశేషాల్లో జీవజాలపరంగా అవిచ్ఛిన్నత, సాంస్కృతిక అవిచ్ఛిన్నతలకు సరస్వతీ నది ఇచ్చే సాక్ష్యాన్ని చేర్చి చూస్తే ఇది స్పష్టమవుతుందని డానినో పేర్కొన్నాడు. ఇది భాషాశాస్త్రం, పురాఖగోళశాస్త్రం, మానవ విజ్ఞానశాస్త్రం, జన్యుశాస్త్రం సహా మరికొన్ని శాఖోపశాఖల్లోకి అధ్యయనాన్ని కోరుతుందని డానినో గుర్తించాడు.

జర్మనీకి చెందిన హిందూ మత పరిశోధకురాలు అనెట్ విల్కే - చారిత్రక నది సరస్వతి స్థలపరంగా గుర్తించదగ్గ పౌరాణిక నది అనీ, హిందూ పురాణాలు కూర్చేనాటికే ఇది ఎడారిలో ఇంకిపోయి చిన్నగా అయిపోయిందనీ పేర్కొంది. వేదాల తర్వాత నాటి ఈ పాఠ్యాలు తరచుగా నది ఎండిపోవడం గురించి ప్రస్తావిస్తూనే, సరస్వతీ దేవిని నదితో కాక భాషతో అనుసంధానిస్తూంటాయి.

మైఖేల్ విజెల్ కూడా ఋగ్వేదంలో సరస్వతి అప్పటికే దాని ప్రధాన నీటి వనరును కోల్పోయి, చేరుకోవాల్సిన తుది సరస్సు సముద్రం లో ముగిసిపోతుందని ప్రస్తావించాయని పేర్కొన్నాడు.

                                     

2.3. గుర్తింపు సిద్ధాంతాలు పునరుద్ధరణ

1986 నుండి సరస్వతి పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి మొదలుపెట్టాయి. హర్యానాలోని సరస్వతి నది శోధ్ సంస్థాన్ చేపట్టిన కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచాయి. 2002 లో ఎన్.డి.ఎ. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, 50 కిలోమీటర్లు పొడవున్న సరస్వతి మహానది రూపనహర్ కాలువను తవ్వించారు.

                                     

3. మరింత సమాచారం

 • The Quest for the Origins of Vedic Culture. ISBN 0-19-513777-9.
 • Gupta, S.P. ed. 1995. The lost Sarasvati and the Indus Civilization. Kusumanjali Prakashan, Jodhpur.
 • Cultural tradition and Palaeoethnicity in South Asian Archaeology. ISBN 0948-1923.
 • Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects.
 • Frawley David: The Rig Veda and the History of India, 2001. Aditya Prakashan, ISBN 81-7742-039-9
 • Oldham, R.D. 1893. The Sarsawati and the Lost River of the Indian Desert. Journal of the Royal Asiatic Society. 1893. 49-76.
                                     

4. బయటి లింకులు

 • The Sarasvati in the Rig Veda by D. Frawley
 • How old is the Rig Veda?
 • The rediscovery of the Sarasvati River
 • Map "પ્રદેશ નદીનો તટપ્રદેશ બેઝીન સરસ્વતી Regional River Basin: Saraswati Basin". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department.
 • The Saraswati: Where lies the mystery by Saswati Paik
 • Sarasvati research and Education Trust
 • Articles on the Saraswati,
 • Is River Ghaggar, Saraswati? by Tripathi,Bock,Rajamani, Eir
 • Sarasvati-Sindhu civilization and Sarasvati River
 • Recent Research on the Sarasvati River
 • More Vedic discoveries
 • Saraswati – the ancient river lost in the desert by A. V. Sankaran