Топ-100
Back

ⓘ వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలో ..
వినాయకుడు
                                     

ⓘ వినాయకుడు

వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా, కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలలను గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.

ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు. సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు. కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, మరియు అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు. శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ గణపతి అన్ని హిందూ సాంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు. గాణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.

గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.

                                     

1. పద వ్యుత్పత్తి

వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు.

గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు.

                                     

2. హిందూమతంలో వినాయకునిప్రాముఖ్యత

భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాధాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.

వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత. ధార్మిక, లౌకిక కార్యక్రమాల ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం

వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు దేవదేవుడు అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, గణపతి అథర్వశీర్షము.

                                     

3. స్వరూపం

భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాళు, చిత్రాలు కనిపిస్తుంటాయి.

క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన 7వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతిబదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు.                                     

3.1. స్వరూపం విగ్రహాలు, చిత్రాలు

ఆదినుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.

వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటినుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం". అలాగే పెద్ద పొట్టకూడా మొదటినుండి గుప్తుల కాలంనుండి వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు హేరంబుడు, మహోదరుడు ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది. వినాయకునికి రెండు చేతులనుండి, 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతులవరకు ఉన్న ప్రతిమలు చెక్కారు. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి పాము ని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా బెల్టులాగా, చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురుమీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తలమీద తిలక చిహ్నం, చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు

వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంధంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని, ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.

                                     

3.2. స్వరూపం వాహనం

అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయకవిగ్రహాలలో వాహనాన్ని చూపలేదు. ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక. జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. చూపబడినాయి

7వ శతాబ్దంనుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని Martin-Dubost అభిప్రాయపడ్డాడు. లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.

ఎలుక వాహనం సంకేతాన్ని అనేకవిధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని సర్వాంతర్యామి మరొక అభిప్రాయం ఉంది.

                                     

3.3. స్వరూపం ఇతర విశేషాలు

ఓంకారము

హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:

గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.

మూలాధార చక్రము

కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై చుట్టు చుట్టుకొని, నిద్రాణమై ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు.

                                     

3.4. స్వరూపం వినాయక స్వరూపానికి తాత్విక వివరణ

వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్ధ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.

 • పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
 • వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" ప్రణవం ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
 • ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.
 • మాల - జ్ఙాన సముపార్జన
 • చేతిలో పాశము - విఘ్నాలు కట్టిడవసే సాధనము
 • ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
 • విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
 • వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
 • చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
 • పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
 • మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము


                                     

4.1. వినాయకుని గూర్చి కథలు వినాయకుని జననం, ఏనుగు తల

వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కథ, వినాయక చవితి వ్రతంలో చదివేది: గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు శివుని తన శరీరములో దాచుకొన్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం, తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలివద్ద కాపలా ఉంచింది. ఆ బాలుడు ద్వారముదగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు.

బ్రహ్మవైవర్త పురాణములోని కథ: శివుని ఉపదేశము ప్రకారము పార్వతి విష్ణువును పూజించి, పుణ్యకవ్రతము మాచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మము వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు.

మరొక కథ ప్రకారం వరాహ పురాణం - శివుని నవ్వునుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన దిష్టి తగులకుండా? శివుడు అతనికి ఏనుగు తల, బాన పొట్ట ఉండేలా చేశాడు.

                                     

4.2. వినాయకుని గూర్చి కథలు గణాధిపత్యం, చంద్రునినవ్వు, పార్వతిశాపం

ఈ కథ వినాయక వ్రత కల్ప విధానము వ్యాసంలో వివరంగా ఇవ్వబడినది గణాధిపతి స్థానానికి వినాయకుడూ, కుమారస్వామీ పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు- "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చెసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది". కుమార స్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయుణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించింది.

గణాధిపతియైన వినాయకుడు లోకములపూజలు అందుకొని, సుష్టుగా భోజనం చేసి, కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదిచూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు దృష్టి దోషానికి వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి "నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురు గాక" అని శపించింది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడయినాదు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు.

లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి బాధ్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు నవ్విన నాడు మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా శ్యమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని ఋజువు చేసుకొన్నాడు. కాని శక్తి హీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు "బాధ్రపద శుద్ధ చవితి" నాడు వినాయకుని పూజించి, ఈ కథ విని, అక్షతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు

                                     

4.3. వినాయకుని గూర్చి కథలు సిద్ధి, బుద్ధి

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెళ్ళి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.

                                     

4.4. వినాయకుని గూర్చి కథలు కాకిరూపంలో గణపతి

తమిళనాట ప్రచారంలో ఉన్న గాథ అగస్త్యమహర్షి ఒకసారి కోపించి కావేరీనదీ జలాలను తన కమండలంలో బంధించివేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి, ఇంద్రుడు ప్రార్థించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని త్రాగుతున్నట్లు నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోయాడు. మళ్ళీ కావేరి నది మామూలుగా ప్రవహించసాగింది. తన తొందరపాటును తెలిసికొని అగస్త్యుడు వినాయకుని స్తుతించాడు.

                                     

4.5. వినాయకుని గూర్చి కథలు భూకైలాస్ కథ

తెలుగునాట ప్రసిద్ధి చెందిన నాటకము ఒకసారి రావణుడు శివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే లింగరూపుడై రావణుని చేతికి వచ్చాడు. కాని ఎక్కడ నేలమీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమౌతానని చెప్పాడు. సంధ్యా వందనసమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాల బ్రహ్మచారి రూపంలో వస్తాడు. రావణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కాని ఆయన "నేను నీ అంత బలవంతుని కాను. మోయలేకపోయినప్పుడు మూడుసార్లు పిలిస్తాను. నువ్వు రాకుంటే క్రింద పెట్టేస్తాను" అని షరతు విధించి ఆత్మలింగాన్ని తీసికొన్నాడు. సంధ్యావందనం మధ్యలో మూడుసార్లు పిలిచినా సమయానికి రావణుడు రాలేకపోయాడు. బరువు మోయలేనివానివలె గణపతి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు. ఆవిధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రము. రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే ఐదు భాగాలుగా విడి పోయి, సముద్రతీరములోని ఐదు చోట్ల పడితే ఆ ఐదు కూడా పుణ్యక్షేత్రాలగా వెలిశాయు. అ క్షేత్రాలలో కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర ఒకటి.

                                     

4.6. వినాయకుని గూర్చి కథలు మహాభారతానికి వ్రాయసకాడు

వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్ధునికోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు - వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు - తాను చెప్పినదానిని పూర్తిగా అర్ధం చేసుకొనే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.

                                     

5.1. పండుగలు, ఆచారాలు, దేవాలయాలు పూజ, పండుగలు

అనేక ధార్మిక, లౌకిక కార్యక్రమాలలో వినాయకుని పూజించడం సర్వసాధారణం. ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటపుడు ముందుగా వినాయకుని పూజిస్తారు గనుక అతనిని "ప్రధమపూజ్యుడు" అంటారు. అలాగే పెళ్ళి, పుట్టినరోజు, శంకుస్థాపన, గృహప్రవేశం, క్రొత్త వాహనం కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారం మొదలు పెట్టడం, ముహూర్తం నిశ్చయించడం, జాతకం వ్రాయడం, ఉత్తరం వ్రాయడం - ఇలా ఎన్నో సందర్భాలలో వినాయకుని పూజిస్తారు లేదా స్మరిస్తారు. వినాయకుని బొమ్మ లేదా ప్రతిమ లేని హిందూ గృహం అరుదు. అన్ని కులాలు, సంప్రదాయాలు, శాఖలలోను, అన్ని ప్రాంతాలలోను వినాయకుని పూజ జరుగుతూ ఉంటుంది. ముందుగా వినాయకుని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరంగా ఉంటాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనుల - ఇలా అన్ని శాఖలలోను వినాయకుని పూజించే ఆచారం ఉంది. సంగీత నృత్యప్రదర్శనలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, మీటింగులు, ఫంక్షనులు కూడా వినాయకుని ప్రార్థనతో మొదలవుతుంటాయి. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః వంటి ప్రార్థనా మంత్రాలను తరచు ఉచ్ఛరిస్తుంటారు.

వినాయకునికి అధికంగా లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలుగునాట పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్ధాలు నివేదన చేస్తారు. ఎర్ర చందనం పూస్తారు. గరిక, మారేడు వంటి పత్రులను పూజలో వాడుతారు. వినాయకుని మందిరం వద్ద జిల్లేడు చెట్టు ఉండడం కూడా సాధారణంగా చూడవచ్చును.

ఇలా సందర్భానుసారంగాను, నిత్య పూజా కార్యక్రమంలో భాగంగాను చేసే పూజలు మాత్రమే కాకుండా వినాయకునికి సంబంధించిన రెండు పండుగలు జరుపుకొంటారు. అవి -

 • బాధ్రపద శుద్ధ చతుర్ధి నాడు ఆగస్టు / సెప్టెంబరు నెలలలో వచ్చే వినాయక చవితి
 • మాఘ కృష్ణ చతుర్ధి నాడు జనవరి / ఫిబ్రవరి నెలలలో వచ్చే వినాయక జయంతి
వినాయక చవితి

బాధ్రపద శుద్ధ చతుర్ధినాడు వచ్చే వినాయకచవితి దాధాపు దేశమంతటా పెద్దయెత్తున నిర్వహింపబడుతుంది. ఈ పండుగలో గమనించదగిన ముఖ్యాంశాలు

 • లడ్డూలు, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్ధాల నివేదన
 • 9రోజుల ఉత్సవాల తరువాత, 10వ రోజున ఉత్సవ విగ్రహాల నిమజ్జనం
 • వీధివీధినా గణపతి ప్రతిష్ఠ, సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
 • మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పత్రితోను పూలతోను పూజ చేయడం

ఈ విధంగా ఈ పండుగ కుటుంబ పరిధిలోను, సామాజికంగాను కూడా జరుపుకునే పండుగగా రూపు దిద్దుకొంది. అంతకు ముందు ఇంటిపూజకే పరిమితమైన పూజా విధానం 1893లో బాల గంగాధర తిలక్ అధ్వర్యంలో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలుగా రూపుదిద్దుకొన్నాయి. హిందూ సమాజంలో వివిధ వర్ణాల మధ్య సుహృద్భావాన్ని పెంచడానికి, జాతీయతాభావాన్ని ప్రోత్సహించడానికి ఈ విధమైన ఉత్సవాలు ఉపయోగపడుతాయని అతని లక్ష్యం. అతను నెలకొలిపిన సంప్రదాయం మైదానాలలో విగ్రహాలను ప్రతిష్ఠించడం, 10వ రోజున నిమజ్జనం చేయడం ఇప్పటికీ కొనసాగుతున్నది.                                     

5.2. పండుగలు, ఆచారాలు, దేవాలయాలు దేవాలయాలు

దేశంలో కొన్ని మందిరాలు ప్రధానంగా వినాయకుని మందిరాలుగా ఉంటాయి ఉదాహరణకు కాణిపాకం. అయితే అనేక దాదాపు అన్ని దేవాలయాలలోను వినాయకుని ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. కోటలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు, వీధులు, రావిచెట్టు - ఇలా అనేక స్థానాలలో గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తుంటారు. ప్రత్యేకంగా వినాయకుడు ప్రధాన దైవంగా ఉన్న లేదా గణపతి పూజకు ప్రాముఖ్యత ఉన్న కొన్ని ఆలయాలు -

 • కేరళ - తిరుచిరాపల్లి జంబుకేశ్వర మందిరం - ఉచ్చి పిళ్లైయార్ కొట్టై, పిళ్లైయార్ పట్టి కర్పగవినాయక మందిరం, రామేశ్వరం, సుచీంద్రం
 • మధ్య ప్రదేశ్ - ఉజ్జయిని
 • కర్ణాటక - హంపి, కాసరగోడ్, ఇదగుంజి
 • మహారాష్ట్ర - వై, మోరెగావ్
 • బీహార్ - బైద్యనాధ్
 • రాజస్థాన్ - జోధ్ పూర్, నాగోర్, రాయిపూర్ పాలి
 • ఉత్తరప్రదేశ్ - వారాణసి ధుండిరాజ్ మందిరం,
 • ఆంధ్ర ప్రదేశ్ - కాణిపాకం
 • గుజరాత్ - బరోడా, ఢోలక్, వల్సాద్
                                     

5.3. పండుగలు, ఆచారాలు, దేవాలయాలు అష్ట వినాయక మందిరాలు

మహారాష్ట్రలో పూణె సమీపంలో 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎనిమిది ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు.

 • గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి pune to Lenyadri 97 km
 • వరద వినాయక మందిరం, మహాడ్ pune to mahad 130 km
 • మోరెగావ్, అష్టవినాయక మందిరం pune to morgaon 80 km
 • మహాగణపతి మందిరం, రంజనగావ్ pune to Ranjangaon, 52 km
 • చింతామణి మందిరం, తియూర్ pune to Theur 28 km
 • సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్ pune to Siddhatek 111 km
 • విఘ్నహర మందిరం, ఒజార్ pune to Ozar 223 km
 • బల్లాలేశ్వర మందిరం, పాలి pune to Ballaleshwar Pali 119 km

వీటిలో ముందుగా మోరేశ్వర మందిరాన్ని దర్శించే సాంప్రదాయం ఉంది.

కాణిపాకం

కాణిపాకం, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి ముప్పై నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.

కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయని, స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

                                     

6. ఇతర దేశాలు, మతాలలో

వాణిజ్య, ధార్మిక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతల పూజా సంప్రదాయాలు నెలకొన్నట్లే వినాయకుని పూజించడం కూడా అందిపుచ్చుకొన్నారు. ఇది ప్రధానంగా 10వ శతాబ్దంలో జరిగింది. ముఖ్యంగా వ్యాపారులు పూజించే దేవతామూర్తులలో వినాయకుడు ముఖ్యుడుగా ఉన్నాడు. మలయా ద్వీపకల్పంలోని అనేక భాగాలలో వినాయకుని విగ్రహాలు లభించాయి. ముఖ్యంగా శైవాలయాలలో వినాయకుని పూజ కూడా సర్వసాధారణం. వినాయకుని మూర్తిచిత్రీకరణలో స్థానిక సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తుంది. క్రమంగా ఈ సంస్కృతి బర్మా, థాయిలాండ్, కంబోడియాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రధానంగా బౌద్ధ సమాజమైన థాయిలాండ్‌లో వినాయకుడు విఘ్ననివారకునిగా పూజలందుకొంటున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ, బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేశ విగ్రహాలు లభించాయి.

మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగాను, మరొకొన్నిసార్లు హిందూ రాక్షసునిగాను కూడా చూపబడింది. గుప్తుల కాలం చివరిభాగంలోని బౌద్ధ శిల్పాలలో వినాయకుని శిల్పాలున్నాయి. బౌద్ధ దేవతగా వినాయకుడు అధికంగా నృత్యముద్రలో చూపబడ్డాడు. ఉత్తర భారతదేశం, నేపాల్, టిబెట్‌లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. వాహనం సింహం. టిబెట్టులో వినాయకుని చిత్రీకరణ tshogs bdag అనబడింది. ఒకోమారు దేవునిగాను, ఒకోమారు మహాకాలుని పాదాలక్రింది నలుగుతున్నట్లుగాను చూపారు. మరికొన్ని చోట్ల విఘ్ననివారకునిగా చూపారు కొన్ని వైవిధ్యాలతో వినాయకుడు చీనా, జపాన్ సంప్రదాయాలలో కూడా దర్శనమిస్తాడు. ఉత్తర చైనాలో 531 సంవత్సరానికి చెందిన ఒక విగ్రహం లభించింది. జపాన్‌లో 806 కాలంలో వినాయకపూజ గురించి ప్రస్తావించినట్లు ఆధారం లభించింది.

జైన గ్రంథాలలో గణేశపూజ ప్రస్తావింపబడలేదు కాని చాలామంది జైనులు వినాయకుని పూజిస్తారు. వారు కుబేరుని కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది. వ్యాపార వృత్తులలో జైనులు అధికంగా పాల్గొనడం ఇక్కడ గమనించాలి. 9వ శతాబ్దానికి చెందిన జైన గణేశ విగ్రహం ఒకటి లభించింది. రాజస్థాన్, గుజరాత్‌లలో జైనమందిరాలలో వినాయక విగ్రహాలున్నాయి.

                                     

7.1. అవీ ఇవీ 32 గణపతులు

ప్రధానంగా గణపతుల సంఖ్య 21 కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు. ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32

 • 5 బాల గణపతి
 • 16 శక్తి గణపతి
 • 23 వాతాపి గణపతి
 • 26 త్రిముఖ గణపతి
 • 17 మహా గణపతి
 • 13 విఘ్న గణపతి
 • 15 నృత్య గణపతి
 • 25 త్ర్యక్షర గణపతి
 • 3 శక్తి గణపతి
 • 7 ఉచ్చిష్ట గణపతి
 • 10 దుర్గ గణపతి
 • 4 భక్త గణపతి
 • 2 వీర గణపతి
 • 20 పింగళ గణపతి
 • 14 లక్ష్మీ గణపతి
 • 6 తరుణ గణపతి
 • 24 హేరంబ గణపతి
 • 22 ప్రసన్న గణపతి
 • 19 దుంఢి గణపతి
 • 31 సంకష్టహర గణపతి
 • 27 ఏకాక్షర గణపతి
 • 21 హరిద్రా గణపతి
 • 32 త్రైలోక్యమోహనగణపతి
 • 29 వరసిద్ధి గణపతి
 • 12 వృత్త గణపతి
 • 1 శ్రీ గణపతి
 • 28 వక్రతుండ గణపతి
 • 30 చింతామణి గణపతి
 • 11 విజయ గణపతి
 • 9 విద్యా గణపతి
 • 8 ఉన్మత్త గణపతి
 • 18 బీజ గణపతి
                                     

7.2. అవీ ఇవీ ప్రార్థనలు, కీర్తనలు

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని వినాయకుని అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను ధ్యానిస్తున్నాను

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

అగజ పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం

వినాయకుని ప్రార్థనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్థించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్థనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!

ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
                                     

7.3. అవీ ఇవీ ప్రత్యేకతలు

 • పత్రితో పూజ చేయడం గణపతి ఆరాధనలో ఒక ప్రత్యేకత. 21 పత్రులు లేదా 108 పత్రులు పూజకు వాడాలని శాస్త్రము. ఈ పత్రులన్నింటికీ ఆయుర్వేదవైద్యవిధానంలో మంచి ఔషధీగుణాలున్నాయి.
 • వినాయకుడి చిత్రం పెళ్ళి శుభలేఖల్లో అత్యంతప్రజాదరణ పొందిన చిత్రం. సంప్రదాయవాదులకూ, ఆధునికులకూ కూడా ఇది సామాన్యం
 • ఇప్పుడు పల్లెల్లోనూ, చిన్న నగరాల్లోనూ, మహానగరాల్లోనూ వినాయక చవితికి విగ్రహాలు వీధివీధినా ప్రతిష్ఠించి, పూజలు జరిపి, పెద్దయెత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజున నిమజ్జనమైతే ఒక పెద్ద కార్యక్రమమైపోతున్నది. ప్రజలకూ, ప్రభుత్వానికీ ఇది పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది.
 • తెలుగు వారు వినాయకునికి ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పళ్లు నైవేద్యం పెడతారు. ఇవన్నీ నాగరికత పెరగక ముందు వంటలు. నూనెలూ, వేపుళ్ళూ, దినుసులూ అవసరం లేదు. బహుశా వినాయకుని పూజ అతి ప్రాచీన సంప్రదాయం గనుక ఇలా జరిగి ఉండవచ్చును.
 • వినాయకుడి చిత్రాన్ని గీయడానికి చిత్రకారులు ఎన్నో మెళకువలూ, విధానాలూ రూపొందించారు. ఒకటి రెండు చిన్న గీతలునుంచి క్లిష్టమైన డిజైనులవరకూ ఎన్నో విధాలుగా వినాయకుని చిత్రించారు. ఎక్కువగా ఓంకారాకృతిలో వినాయకుని చిత్రించడం సామాన్యం.
 • ఏ మాత్రము ఆదరణకు నోచుకోని జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు వినాయకుని పూజకు వాడతారు. ఆబొజ్జ గణపయ్య వాహనం ఎలుక. - ఇలా అన్నింటి పట్లా గౌరవం చూపాలనే ఆలోచన ఈ సంప్రదాయంలో ఉండవచ్చు.