Топ-100
Back

ⓘ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు. భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 15-వ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించి ..
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
                                     

ⓘ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 15-వ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికలలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకూ ప్రతినిధులను ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎమ్లు పోటీ పడగా, బహుజన సమాజ్ పార్టీ, ప్రజాశాంతి పార్టీలు కూడా పోటీ చేసాయి. జనసేన, సిపిఐ, సిపిఎమ్, బహుజన సమాజ్ పార్టీలు పొత్తు కుదుర్చుకుని పోటీ చేసాయి. పార్టీల మేనిఫెస్టోలలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత నిచ్చారు. ప్రచారం జోరుగా సాగింది. తెలుగు దేశం ప్రభుత్వ అవినీతిని, అసమర్ధతను ప్రధాన లక్ష్యంగా ఇతర పార్టీలు ప్రచారం చెయ్యగా, తాము అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలుగుదేశం ప్రచారాంశం చేసుకుంది. అదేకాక, విభజన చట్టంలో భాగంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను భాజాపా ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని, వైకాపా అధ్యక్షుడు జగన్ తెరాసతో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలనూ తెలుగుదేశం తన ప్రచారంలో వాడుకుంది. గత ఎన్నికలలో తెదేపా, భాజపా కూటమికి మద్ధతు తెలిపిన జనసేన, ఈసారి నేరుగా పోటీలో దిగింది.

మొత్తం 175 శాసనసభ స్థానాల్లో 2.118 మంది అభ్యర్థులు, 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులూ పోటీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన నాయకులు నలుగురు: తెదేపా తరపున చంద్రబాబు నాయుడు, వైకాపా తరపున జగన్మోహనరెడ్డి, జనసేన తరపున పవన్ కళ్యాణ్, భాజపా తరపున కన్నా లక్ష్మీనారాయణ. భాజపా తరపున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

2019 ఏఫ్రిల్ 11 న జరిగిన పోలింగులో 79.86 శాతం పోలింగు జరిగింది. పోలింగు నాడు అనేక చోట్ల పోలింగు యంత్రాలు పనిచెయ్యక పోవడంతో, వోటర్లు వోటు వెయ్యడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థరాత్రి దాటాక కూడా కొన్నిచోట్ల పోలింగు జరిపారు. హైదరాబాదు, బెంగళూరు వంటి చోట్ల నివసిస్తున్న వోటర్లు తమ స్వస్థలాలకు చేరుకుని మరీ వోటేసారు. దీంతో పోలింగు ముందు మూడు రోజుల పాటు ఈ రెండు నగరాల నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్ళే రైళ్ళు బస్సులపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది. వోటేసేందుకు ప్రజలు చూపిన ఈ ఉత్సాహాన్ని పత్రికలు కీర్తించాయి.

కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇద్దరు మృతి చెందారు. ఎనికలలో పోటీ చేస్తున్నఅభ్యర్థులపై కూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. పోలింగు నిర్వహణ తీరుపై ఎన్నికల సంఘం పలు రాజకీయ పార్టీలు, నాయకులు, సామాన్య పౌరుల నుండి విమర్శలు ఎదుర్కొంది. కొన్ని పోలింగ్ బూతులలో రీపోలింగ్ నిర్వహించారు.

23 మే 2019 న ఓట్ల లెక్కింపు జరిగింది. వైఎస్ఆర్ పార్టీ 151 స్థానాలలో, తెలుగుదేశం 23 స్థానాలలో, జనసేన 1 స్థానంలో గెలుపొందాయి. మిగతా పార్టీలేవీ ఖాతా తెరవలేదు.

                                     

1. వోటర్ల జాబితా

2019 మార్చి 24 న ఎన్నికల కమిషను జిల్లా వారీగా వోటర్ల జాబితాను ప్రకటించింది. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. పురుషులు: 1.93.82.068 మహిళలు: 1.97.95.423 ఇతరులు: 2.019 మార్చి 26న అనుబంధ జాబితా ప్రచురిస్తుంది.

మార్చి 26 న ప్రకటించిన అనుబంధ జాబితాను బట్టి -

రాష్ట్రంలో మొత్తం వోటర్ల సంఖ్య: 3.93.45.717

పురుషులు: 1.94.62.339

స్త్రీలు: 1.98.79.421

ఇతరులు: 3.957

                                     

2. పార్టీలు, పొత్తులు

ఈ ఎన్నికల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలు పోటీ పడ్డాయి. వీటితో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు, బహుజన సమాజ్ పార్టీలు కూడా పోటీ చేసాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ముందే ప్రకటించాయి. జనసేన, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాయావతి సంయుక్తంగా ప్రకటించారు. 2019 మార్చి 18 న తమ నాలుగు పార్టీలూ కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. ప్రజాశాంతి పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కిలారి ఆనంద్ పాల్ ప్రకటించాడు.

                                     

2.1. పార్టీలు, పొత్తులు "రహస్య" పొత్తులు

వివిధ పార్టీలు రహస్యంగా పొత్తులో ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలు పలు ఆరోపణలు చేసుకున్నాయి. వీటికి ఆధారాలేమీ చూపకపోయినా, ఒకరిపై ఒకరు ఆరోపణలు మాత్రం విస్తృతంగా చేసుకున్నాయి.

తెలుగు దేశం పార్టీ ఆరోపణలు: వైకాపా, తెరాస, భాజపా ఈ మూడింటి మధ్య ఒక అప్రకటిత ఒప్పందం ఉందని తెలుగుదేశం ఆరోపించింది. నరేంద్ర మోదీ, కేసీయార్‌ల ఆదేశాలకు అనుగుణంగా జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని తెలుగుదేశం ప్రచారం చేసింది. ఫ్యాను ఇక్కడ, స్విచ్చి హైదరాబాదులో, కరెంటు ఢిల్లీలో అంటూ చంద్రబాబు నాయుడు విమర్శించాడు.

వైకాపా ఆరోపణలు: తెలుగుదేశం, జనసేన అప్రకటిత పొత్తులో ఉన్నాయని వైకాపా ఆరోపించింది. జనసేన తెలుగుదేశానికి బి టీమ్ అని ఎద్దేవా చేసింది.

                                     

3. నినాదాలు

ఈ ఎన్నికల్లో కొన్ని ఆకట్టుకునే నినాదాలతో పార్టీలు ప్రజల ముందుకు వెళ్ళాయి.

                                     

4. ఆస్తులు, నేరస్థులు

ఎన్నికల కమిషను ఆదేశాల ప్రకారం నామినేషనులో ప్రాథమిక సమాచారంతో పాటు సమర్పించే అఫిడవిట్‌లో తమతమ ఆస్తులను, తాము ఎదుర్కొంటున్న నేరారోపణలనూ కూడా రాయాలి.

పెండింగులో ఉన్న నేరారోపణ కేసులు

చంద్రబాబునాయుడు తన అఫిడవిట్లో తనపై ఒక కేసు ఉన్నట్లు రాసాడు. 2010 లో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసిన కారణంగా ఈ కేసు పెట్టినట్లు రాసాడు. వైకాపా నేత వై.ఎస్. జగన్మోహనరెడ్డి సమర్పించిన అఫిడవిట్లో తనపై 31 నేరారోపణ కేసులున్నాయని తెలిపాడు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తనపై కేసులేమీ లేవని అఫిడవిట్లో పేర్కొన్నాడు. నేరం రుజువైన కేసులు ఏమీ లేవని అందరూ తమతమ అఫిడవిట్లలో పేర్కొన్నారు.

వై.ఎస్. జగన్మోహనరెడ్డి సమర్పించిన అఫిడవిట్ తెదేపా విమర్శలకు గురైంది. 48 పేజీల ఈ అఫిడవిట్లో 31 కేసులు ఉన్నాయని, ఇవి జగన్మోహనరెడ్డి నేరచరిత్రకు రుజువులనీ తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నాడు. దేశంలో ఎవరి అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు ఉండవని ఆయన అన్నాడు.

                                     

5.1. మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు తెదేపా

తెలుగు దేశం పార్టీ 2019 ఏప్రిల్ 6, ఉగాది నాడు తన మేనిఫెస్టో విడుదలచేసింది. ప్రధానంగా పంచసూత్ర దార్శనికత 5 పాయింట్స్ విజన్ ప్రకారం ముఖ్యమైనవి.

 • నదుల అనుసంధానం ద్వారా పంచనదుల మహాసంగమాన్ని చేస్తుంది. డిసెంబర్ 2019నాటికి పోలవరం పూర్తిచేయుట. అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయుట.
 • కోస్తా తీరం పొడవునా బీచ్ రోడ్డును నిర్మాణం
 • ప్రపంచంలో 5వ అద్భుత నగరంగా అత్యంత జీవనయోగ్య నగరంగా, నీలి & హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతుంది.
 • పారిశ్రామిక రంగంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయటం. మండల స్థాయిలో వ్యవసాయ, పరిశ్రమల, ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం.
 • కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహం. సోలార్ పవర్, బయో ప్లాంట్లను స్థాపన, ప్రతి పంపుసెట్ కు సోలార్ కనెక్షన్. 10 లక్షల విద్యుత్ వాహనాలను వినియోగం.

ఇతర ముఖ్యాంశాలు:

 • పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులు
 • ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంక్‌ ఏర్పాటు; మత్స్యకారుల క్రాప్‌ హాలిడేకి రూ.10 వేలు సాయం; పట్టణాల్లో తోపుడుబండ్లకు ఇబ్బంది లేకుండా చేస్తాం
 • వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం; కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్‌ అభివృద్ధి; 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం; ఐదేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా పరిష్కారం
 • విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం; ప్రతి గ్రామం నుంచి మెయిన్‌రోడ్డుకు బీటీ రోడ్డు;
 • తిరుపతికి ఎలక్ట్రానిక్‌ హబ్‌ ఏర్పాటు; విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు
 • విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు రూ. 20 లక్షలు; వైద్యంలో రూ.5లక్షల వరకు ఉచితం సాయం
 • ఇంటర్మీడియట్‌ నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
 • ప్రతి ఏటా అన్నదాత సుఖీభవ కార్యక్రమం; రైతులకు వడ్డీలేని రుణాలు; రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
 • మాదిగలు, రెల్లి, యానాది కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు; వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు


                                     

5.2. మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు వైకాపా

వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు. జనాకర్షక పథకాలలో కొన్ని:

 • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
 • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
 • రైతులకు,కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
 • ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ
 • మూడు దశల్లో మద్యపాన నిషేధం
 • కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
 • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
 • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
 • ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
 • రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
 • రైతులకు రూ.12.500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
                                     

5.3. మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు జనసేన

జనసేతన మ్యానిఫెస్టోను 2019 మార్చి 14 న రాజమండ్రి బహిరంగ సభలో ప్రకటించింది. ఈ మానిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

 • మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ కేంద్రాలు
 • 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ప్రతీ మండలంలో సంచార డయాగ్నాస్టిక్ కేంద్రాలు
 • వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు తాగునీటి సాగునీటి సౌకర్యం కల్పిస్తాం.
 • చిన్న పరిశ్రమలకు 75 పైసల వడ్డీతో రూ. 5.000 ఆర్థిక మద్దతు
 • నిరుద్యోగులకు అవకాశాల జోన్లు
 • గోదావరి జిల్లాల్లో రూ. 5.000 కోట్ల పెట్టుబడితో పండ్లు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి తోడ్పాటు. ప్రతి మండలం లోను ఆహార ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటు.
 • 1 వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ విద్యార్థులకు ఉచిత చదువు. డొక్కా సీతమ్మ క్యాంటీన్ పథకం కింద విద్యార్థులకు ఆహారం. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం
 • రైతులకు ఒక్కొక్క ఎకరానికి రూ. 8.000. రైతు రక్షణ భరోసా పథకం కింద 60 ఏళ్ళు దాటిన రైతులకు రూ. 5.000 పింఛను.
 • ప్రతి మండలంలో ఆర్ట్స్, సైన్సు కాలేజీ. సాంకేతిక కళాశాలల్లో ఇన్నొవేషన్, ఇన్క్యుబేషన్ హబ్‌లు


                                     

5.4. మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు కాంగ్రెసు

కాంగ్రెసు మ్యానిఫెస్టోను 2019 మార్చి 22 న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించాడు. మానిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

 • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమర్థంగా అమలు. కార్పొరేట్‌ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ. విద్యా హక్కు చట్టం పటిష్ఠ అమలు
 • స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర
 • ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం రద్దు
 • చేనేత కార్మికులకు అప్పులు పూర్తిగా మాఫీ. వారికి జీఎస్టీ నుంచి మినహయింపు
 • వికలాంగులకు రూ.3వేలు పింఛను. 50 - 60 ఏళ్ల వారికి రూ.2వేలు, 60-70 ఏళ్ల వారికి రూ.2.500, 70 ఏళ్లు దాటిన వారికి రూ.3వేలు పింఛను. ఒంటరి మహిళలకు పెన్షన్‌
 • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ లాగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధతతో సబ్‌ప్లాన్‌
 • సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్‌ విధానం తొలగింపు
 • రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
 • పేద కుటుంబానికి ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
 • రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
 • రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం. అన్ని జబ్బులనూ చేరుస్తారు. ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం
 • పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి
 • రజకులు, వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు, వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
                                     

5.5. మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు భాజపా

భారతీయ జనతా పార్టీ తమ మ్యానిఫెస్టోను 2019 మర్చి 26 న విడుదల చేసింది. దానిలోని ప్రధాన విశేషాలివి:

 • ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ;
 • రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, ఉచిత స్థలం. సీపీఎస్‌ రద్దు; వలస విధానానికి ప్రతీకగా కొనసాగుతున్న బిళ్ళ బంట్రోతు విధానానికి స్వస్తి; హోంగార్డులకు నెలకు రూ.20వేలు.
 • తెలుగుదేశం ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ
 • రాయలసీమలో హైకోర్టు
 • స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా పథకాలను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లతో లింకు చేసి, రూ.కోటి రూపాయల వరకు పూచీకత్తు లేని రుణం.
 • రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా చేస్తూ 25 జిల్లాల ఏర్పాటు

పై ప్రధానాంశాలతో పాటు అనేక ఇతర అంశాలను కూడా మ్యానిఫెస్టోలో చేర్చారు. వాటిలో కొన్ని:

 • విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతం; తిరుపతి కేంద్రాలుగా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలు.
 • డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు; డిగ్రీ విద్యార్థినులకు 90% సబ్సిడీపై స్కూటర్లు
 • వ్యవసాయానికి 16 గంటల విద్యుత్తు; 50% రాయితీతో ఎకరానికి రెండు బస్తాల ఎరువులు; వ్యవసాయ ప్రణాళిక కమిషను ఏర్పాటు.
 • 60 ఏళ్లు దాటినవారికి మండలానికో ఆనందాశ్రమం; నెలకు రూ.3వేల పింఛను.


                                     

5.6. మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు మ్యానిఫేస్టోల విశ్లేషణ

టిడిపి, వైసిపిల మ్యానిఫెస్టోలు -కీలకాంశాలైన రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన ప్రాధాన్యత తక్కువగా, వ్యవసాయం, భూ పంపిణీ, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన వంటి కీలకాంశాలపై శాశ్వత పరిష్కారానికి చర్యలు ప్రతిపాదించడానికి బదులుగా జనాకర్షక పథకాలతో కూడి వున్నాయి అని పత్రికలలో వార్తలు వచ్చాయి. అలాగే జనాకర్షక పథకాలకు అయ్యే ఖర్చు విపరీతంగా వుంటుందని కూడా విమర్శలు వచ్చాయి.

                                     

6.1. ప్రచారాలు, విమర్శలు ప్రచారాంశాలు

ప్రజాకర్షక పథకాలు ప్రచారం లోని ప్రధానమైన అంశాల్లో ఒకటి. వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, రైతులకు చేసే ప్రయోజనాలు, మొదలైన అనేక ప్రజాకర్షక పథకాలు పార్టీల ప్రచారంలో చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న పక్షపాతం, అందులో భాగమైన ప్రత్యేక హోదా, అభివృద్ధిలో భాగమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైనవి ఇతర ప్రధాన ప్రచారాంశాలు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, ప్రధాని నరేంద్ర మోదీ - ఈ ముగ్గురూ కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో రహస్య ఒప్పందం ఉన్నదనే ఆరోపణ వైకాపా ప్రచారాస్త్రాల్లో ఒకటి.

వీటితో పాటు కొన్ని ఘటనలు కూడా ప్రచారంలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి: జగన్మోహనరెడ్డి బాబాయి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య, డేటా చోరీ వివాదం, మూకుమ్మడిగా వోట్ల తొలగింపు ప్రయత్నం ఆరోపణలు, జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి.

                                     

6.2. ప్రచారాలు, విమర్శలు ప్రచార సరళి

తెలుగు దేశం పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నాడు. తాను ఆనవాయితీగా చేస్తున్నట్లే, ఈసారి కూడా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టాడు. వైకాపా తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసాడు. దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్రలో అతడు ఈసరికే రాష్ట్రమంతా ఒకసారి పర్యటించాడు. జనసేన తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసాడు.

చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే జనసేన పనిచేస్తోందని, అతడి ఆదేశంతోటే మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ జనసేనలో చేరాడని వైకాపా నాయకుడు జగన్మోహనరెడ్డి విమర్శించాడు.

పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, వైకాపా తెరచాటు పొత్తులో ఉన్నాయని విమర్శించాడు. గాజువాకలో నామినేషను వేసాక చేసిన ప్రసంగంలో - చంద్రబాబు నాయుడుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే రాజమార్గంలో ఆంధ్రకు వచ్చి పోటీ చేయాలని తెరాసకు సూచించాడు. తన రెండవ నామినేషను వేసాక భీమవరంలో చేసిన ప్రసంగంలో - హైదరాబాదులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవారిపై దాడులు చేస్తున్నారని విమర్శించాడు. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుండి మా పార్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాకంటే పెద్ద పార్టీ ఐన వైకాపా ఎందుకు పోటీ చెయ్యడం లేదు అని అతడు ప్రశ్నించాడు. దీనికి స్పందనగా, జనసేన ప్రతిపక్షమై ఉండి కూడా అధికారపక్షాన్ని ఏమీ అనడం లేదని, తెదేపాతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని వైకాపాపై కువిమర్శలు చేస్తోందనీ వైకాపా విమర్శించింది. పవన్ ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి తెదేపాకు అండగా నిలబడ్డాడని, ఇది రాజకీయాల్లోకి అతడు తెచ్చిన కొత్త ట్రెండ్‌ అనీ విమర్శించింది. పవన్ చేసిన విమర్శల కారణంగా అతడు వివిధ వర్గాలనుండి ప్రతి విమర్శ ఎదుర్కొన్నాడు. అతడిపై హైదరాబాదులో పోలీసు కేసు పెట్టారు.

2019 మార్చి 21 న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఒక కార్యక్రమంలో మాట్లడుతూ, ప్రత్యేక హోదా అనేది విసుగెత్తించే సంగతి బోరింగు సబ్జెక్టు అని వ్యాఖ్యానించాడు. దీనిని ఇతర పార్టీలు విమర్శించాయి.

ప్రచారం చివరిరోజుల్లో తెరాస అధినేత కే చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకు పోలవరం ప్రాజెక్టుకు తమ మద్ధతు వుంటుందని ప్రకటించాడు. అలా అయితే ఇప్పటివరకు పోలవరంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసును విరమించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాకు సమ్మతిస్తూ కేంద్రానికి లేఖ రాయాలనీ చంద్రబాబు నాయుడు అడిగాడు.

                                     

7.1. ఫిర్యాదులు, చర్యలు అధికారుల బదిలీలు

2019 మార్చి 25 రాత్రి ఎన్నికల కమిషను ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంటెలిజెన్స్ డైరెక్టరు జనరల్ డీజీ ఎ బి వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం లను తమతమ బాధ్యతల నుండి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. వారికి ఎన్నికల బాధ్యతలేవీ అప్పగించరాదని తెలిపింది. ఈ ముగ్గురిపై వైకాపా నాయకులు లిచ్చిన ఫిర్యాదుపై కమిషను ఈ చర్య తీసుకుంది. అయితే వెంకతేశ్వరరావు బదిలీని నిలుపు చేస్తూ మార్చి 27 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరొక ఆదేశాన్ని జారీ చేసింది. కమిషను ఆదేశాలను రద్దు చేయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కమిషను ఆదేశాలపై తాము జోక్యం చేసుకోమని, ఇంటిలిజెన్స్ డీజీ బదిలీపై స్టే ఇవ్వలేమనీ మార్చి 29 న కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం ఇంటిలిజెన్స్ డీజీని బదిలీ చేసింది.

ఇదిలా ఉండగా ఎస్పీ లిద్దరూ తమ బదిలీల పట్ల ఆందోళన, అభ్యంతరం తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖలు రాసారు. వెంకటరత్నం తనపై ఫిర్యాదు చేసిన వారిపై సివిలు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

ఐపిఎస్ అధికారుల బదీలల ఉత్తర్వులు రద్దుజేసి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాను విచారించిన తరువాత, ఏప్రిల్ 6 న ఎన్నికల కమీషన్ ఆయనను బదిలీ చేసింది. అతడి స్థానంలో కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఎన్నికల విధులకు దూరం పెట్టింది.

                                     

8. పార్టీ మార్పిళ్ళు

ఎన్నికల ముందు నాయకులు యథేచ్ఛగా పార్టీలు మారారు. తామున్న పార్టీలో టిక్కెట్లు అసలు దొరక్కపోవడం, ఒకవేళ దొరికినా అశించిన స్థానానికి దొరక్కపోవడం వంటి కారణాల వలన కూడా పార్టీలు మారారు. అయితే, హైదరాబాదులో తమ పార్టీ నాయకులకు ఉన్న ఆస్తుల విషయంలో ఇబ్బందులు పెడతామని భయపెట్టి, వారిని తెలుగు దేశం పార్టీ నుండి మారేలా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒత్తిడి చేస్తున్నదని చంద్రబాబు నాయుడు అరోపించాడు.

                                     

8.1. పార్టీ మార్పిళ్ళు కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం

ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టరు లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారనే విషయమై పలు వార్తలు వచ్చాయి. 2018 నవంబరులో లోక్‌సత్తా పార్టీలో చేరమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించగా పరిశీలిస్తానని లక్ష్మీనారాయణ చెప్పాడు. లోక్‌సత్తాలో చేరే ఆలోచన వద్దనుకుని, సొంతంగా ఒక కొత్త పార్టీ పెట్టనున్నాడని ఆ తరువాత పత్రికల్లో ఊహాగానాలు వచ్చాయి. పార్టీ పేరు జనధ్వని అని కూడా అవి రాసాయి. ఆ తరువాత 2019 మార్చి 12 న, తెలుగుదేశంలో చేరనున్నాడా? అని ప్రశ్నిస్తూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. చివరగా 2019 మార్చి 17 న అతడు జనసేన పార్టీలో చేరాడు. తాను తెదేపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టించినవేనని అతడు చెప్పాడు. చంద్రబాబు ఆదేశాల మేరకే లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరాడని వైకాపా విమర్శించింది.

                                     

9. ఇతర విశేషాలు

 • ప్రజాశాంతి పార్టీ నేత కిలారి ఆనంద్ పాల్, 2019 మార్చి 22 న నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసాడు. అయితే నామినేషన్ పత్రంలో చాలావరకు పూర్తి చెయ్యకుండా ఖాళీగా వదిలేసాడు. అఫిడవిట్‌ను ఇవ్వనే లేదు. అతడు భీమవరం శాసనసభ స్థానంలో కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ గడువు సమయం ముగిసే లోపు సమర్పించనందున అధికారులు అతడి నామినేషన్‌ను స్వీకరించలేదు. అయితే 2019 మార్చి 26 న ఆ రెండు నామినేషన్లను స్వీకరించినట్లు, పరిశీలన తరువాత అంతా సరిగానే ఉన్నట్లూ అధికారులు చెప్పారు.
 • దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా తరపున పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యగా, ఆయన భార్య పురందేశ్వరి భాజపా తరపున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.
                                     

10. 2014 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలిచిన స్థానాలు

2014 ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం అమలు జరగడానికి ముందు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భాజపాలు ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేసాయి. జనసేన ప్రత్యక్షంగా పోటీ చెయ్యలేదు గానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెదేపా, భాజపాలకు మద్దతుగా ప్రచారం చేసాడు.

                                     

11. పోలింగు

పోలింగు 2019 ఏప్రిల్ 11 న జరిగింది. అన్ని నియోజకవర్గాల్లోను ఒకే విడతలో పోలింగు జరిగింది. రాష్ట్ర శాసనసభతో పాటు లోక్‌సభకు కూడా ఒకేసారి పోలింగు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వ తేదీ అర్థరాత్రి వరకు జరిగిన పోలింగు ప్రకారం 13 జిల్లాల్లో సగటున 76.69 శాతం పోలింగ్‌ జరిగిందని ఎన్నికల కమిషను తెలిపింది. కొన్ని కేంద్రాల్లో పోలింగు ఆ తరువాత కూడా కొనసాగింది. అంతిమంగా పోలింగు శాతం 79.64 అని ఎన్నికల సంఘం ఏప్రిల్ 12 న అధికారికంగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో ఈ శాతం 78.41 గా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. 2014 ఎన్నికల కంటే ఇది 26 లక్షలు ఎక్కువ.

ఎలక్ట్రానిక్ వోటింగు మిషన్లు సరిగ్గా పని చెయ్యకపోవడం, పోలింగు బాగా నెమ్మదిగా జరగడం, అర్థరాత్రి దాటాక కూడా కొన్ని కేంద్రాల్లో పోలింగు జరుగుతూనే ఉండటం, అనేక చోట్ల హింస జరగడం, రెండు చోట్ల అభ్యర్థులపై దాడి, పోలింగు యంత్రాలను ధ్వంసం చెయ్యడం, పోలింగు స్టేషన్ల వద్ద వోటర్లకు సరైన సౌకర్యాలు కలగజేయక పోవడం వంటి అనేక సంఘటనలు పోలింగు రోజున చోటుచేసుకున్నాయి. పోలింగు నాటి ఘటనల గురించి ఎన్నికల కమిషను తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి: 25 హింసాత్మక ఘటనలు జరిగగా, వాటిలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించారు. ఆరు చోట్ల మాక్‌ పోలింగ్‌ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించడంలో పోలింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము కోరినన్ని బలగాలు కేంద్రం నుంచి రాలేదని అన్నారు. సాయంత్రం ఆరు గంటలకు వరుసలో ఉన్న వారందరికీ పోలింగ్‌ అవకాశం కల్పించారు.

ఉదయం 7 గంటలకు పోలింగు మొదలైంది. అనేక చోట్ల వోటింగు యంత్రాలు పనిచెయ్యక పోవడంతో వెనక్కి వెళ్ళిన వోటర్లు కొంతమంది మళ్ళీ తిరిగి వచ్చి వోటేసారు. పోలింగు నిదానంగా జరిగిన చోట్ల, గంటల తరబడి లైనులో నిరీక్షించి మరీ వోటేసారు. ఆరు గంటలకు పోలింగు సమయం ముగిసినప్పటికీ, ఆ సమయానికి లైనులో నిలబడ్డ వోటర్లందరికీ వోటేసే అవకాశం కల్పించారు. అలా నిలబడ్డ వాళ్ళు వోటు వెయడం కొన్ని చోట్ల అర్థరాత్రి వరకూ సాగింది. కొన్ని చోట్ల అర్థరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. హైదరాబాదు, బెంగళూరు వంటి చోట్ల నివసిస్తున్న వోటర్లు తమ స్వస్థలాలకు చేరుకుని మరీ వోటేసారు. దీంతో పోలింగు ముందు మూడు రోజుల పాటు ఈ రెండు నగరాల నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్ళే రైళ్ళు, బస్సులపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది. వందలాది అదనపు బస్సు సర్వీసులను నడిపారు. దక్షిణ మధ్య రైల్వే కూడా అదనపు రైళ్ళను నడిపింది. హైదరాబాదు విజయవాడ రహదారిలో పంతంగి రహదారి సుంకం వసూలు కేంద్రం గుండా మామూలుగా రోజుకు 19 వేల వాహనాలు ప్రయాణం చేస్తూండగా, ఏప్రిల్ 10 వ తేదీ ఒక్క రోజునే 37 వేల వాహనాలు వెళ్ళాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వోటు వేసి తీరాలనే ప్రజల ఆకాంక్షలను పత్రికలు ముక్తకంఠంతో కీర్తించాయి. "ఓటెత్తిన రాష్ట్రం" అని ప్రజాశక్తి రాయగా, "ఓటెత్తిన ఆంధ్ర" అని సాక్షి రాసింది. "ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలిచింది, ప్రజలు గెలిచారు" అని ఈనాడు వర్ణించింది. "వెల్లువెత్తిన మహిళాలోకం" అని ఆంధ్రజ్యోతి రాసింది. "ఓట్ల వెల్లువ" అనే శీర్షిక కింద రాసిన వార్తలో విశాలాంధ్ర పత్రిక, ఓటు యంత్రాలు మొరాయించినా విసుగు చెందక గంటల తరబడి క్యూలలోనే ఉండి ఓట్లు వేసారని పేర్కొంది.

పోలింగు జరిగిన విధానంపై ఎన్నికల సంఘం అనేక విమర్శలకు గురైంది. వోటర్లకు పోలింగు స్లిప్పులు సరిగా అందకపోవడం, ఈవీయెమ్‌లు పనిచెయ్యకపోవడం, నిదానంగా జరిగిన వోటింగు, వోటర్లకు పోలింగు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలను ఏర్పాటు చెయ్యక పోవడం వంటి అనేక ఇబ్బందులను వోటర్లు ఎదుర్కొన్నారు. "వోటర్ల స్ఫూర్తికి ఈసీ తూట్లు" అని ఈనాడు విమర్శించింది. ఈసీ విశ్వసనీయతకు తూట్లు అంటూ సంపాదకీయం రాసింది. "ఈసీ ఛీఛీ" అని రాస్తూ, ఆంధ్రజ్యోతి, "పోలింగ్ నిర్వహణలో ఫ్లాప్" అని రాసింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని పలు రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శించారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కేంద్రంలో తాగునీటి సౌకర్యాల లేమి, తగినన్ని షామియానాలు ఏర్పాటు చేయకపోవడం, స్లిప్పుల పంపిణీలో అలసత్వం మొదలైన అంశాలపై అక్కడికి ఓటు వేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను వోటర్లు నిలదీశారు.

                                     

11.1. పోలింగు జిల్లా వారీగా పోలింగు శాతాలు

ఎన్నికల కమిషను ప్రకటించిన జిల్లావారీ పోలింగు శాతాలు ఇలా ఉన్నాయి.

                                     

11.2. పోలింగు నియోజకవర్గం వారీగా పోలింగు శాతాలు

నియోజక వర్గం వారీగా పోలింగు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించాడు. రాష్ట్రం మొత్తంగా నమోదయిన పోలింగ్ శాతం 79.64. ఇది 2014 లో నమోదయిన పోలింగ్ శాతం 77.96 కంటే 1.68 ఎక్కువ. విశాఖపట్నం పశ్చిమ లో పోలింగ్ అత్యల్పంగా 58.19 శాతం నమోదు కాగా, అద్దంకి లో అత్యధికంగా 89.82 శాతం నమోదైంది. పోలింగ్ 2014 తో పోల్చితే విశాఖపట్టణం దక్షిణం లో గతంలో కంటే 4.36 శాతం తగ్గగా, నందికొట్కూరు లో 8.67 శాతం పెరిగింది.

                                     

11.3. పోలింగు ఈవీఎమ్‌ల పనితీరు

పోలింగులో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో పలు విమర్శలు వచ్చాయి. అనేక పోలింగు స్టేషన్లలో ఈవీఎమ్‌లు పని చెయ్యలేదు. వాటిని రిపేరు చేసి, లేదా కొత్తవాటిని నియోగించి పోలింగు మొదలుపెట్టారు. పోలింగు మొదలు పెట్టాక కూడా కొన్ని ఈవీఎమ్‌లు మధ్యలో చెడిపోయాయి. కొన్నిచోట్ల పోలింగు మొదలు పెట్టేందుకు మూడు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 384 ఈవీఎమ్‌లు పనిచెయ్యలేదని, వాటిని రిపేరు చెయ్యడం లేదా కొన్నిటిని పూర్తిగా తీసివేసి, వేరే ఈవీఎమ్‌లను నియోగించడం గానీ చేసామని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పాడు. స్వయంగా ద్వివేది వోటేసేందుకు వెళ్ళిన చోట కూడా యంత్రం పని చెయ్యలేదు. వెనక్కి వెళ్ళిపోయి, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి ఆయన వోటేసాడు. అయితే, 30% పైగా ఈవీఎమ్‌లు పనిచెయ్యలేదని, రీపోలింగు నిర్వహించాలనీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర వ్యాప్తంగా 10% ఈవీఎమ్‌లు పనిచెయ్యలేదని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తపరచాడు.

సమయం ముగిసిన తరువాత కూడా పోలింగు కొనసాగిన పోలింగు కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి:

 • రాత్రి 11:30 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 49
 • రాత్రి 9:15 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 726
 • రాత్రి 12:30 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 14
 • రాత్రి 11:00 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 70
 • రాత్రి 10:00 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 256
 • రాత్రి 10:30 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 139
 • రాత్రి 12:00 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 23
                                     

11.4. పోలింగు హింస

పోలింగ్ రోజున ఎన్నికల్లో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వారి కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. రాయలసీమ లోను, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోనూ వర్గ రాజకీయ కక్షలు బహిర్గతమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, కోడెల శివప్రసాదరావుపై ఇనిమెట్ల గ్రామంలో వైకాపా కార్యకర్తలు దాడి చేసారు. అతడి చొక్కాను చింపేసారు. గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలకడ కట్టకిందపల్లె గ్రామంలో వైకాపా అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. అతడి వాహనం ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ కార్యకర్తలే చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కురుపాం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై జీఎంవలస మండలం చినకుదమ గ్రామంలో తెదేపా కార్యకర్తలు దాడి చేసారు. నరసరావుపేట నియోజక వర్గంలో తెదేపా అభ్యర్థి డాక్టరు అరవిందరావుపై వైకాపా కార్యకర్తలు దాడి చెయ్యగా, తెదేపా కార్యకర్తలు వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి చేసారు. గుత్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి మధుసూదన గుప్తా ఒక పోలింగు కేంద్రంలోని వోటింగు యంత్రాన్ని నేలకేసి కొట్టాడు. అతణ్ణి పోలీసులు అరెస్టు చేసారు.

                                     

11.5. పోలింగు రీపోలింగు

గుంటూరు జిల్లా లోని రెండు పోలింగు కేంద్రాల్లో రీపోలింగు నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ద్వివేది ఏప్రిల్ 13 న చెప్పాడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 244 నంబరు పోలింగు కేంద్రం లోను, నరసరావుపేట నియోజకవర్గంలోని 94వ నంబరు పోలింగు కేంద్రం లోనూ రీపోలింగు కొరకు కేంద్ర సంఘానికి విజ్ఞప్తి పంపించారు. అనూహ్యంగా చివరిదశపోలింగు రోజున మరికొన్ని పోలింగు కేంద్రాలలో తిరిగి పోలింగ్ జరపాలని ఎలెక్షన్ కమీషన్ తీసుకున్న నిర్ణయం వాదోపవాదాలకు కారణమైంది.

                                     

12. ఫలితాలు

వోట్ల లెక్కింపు 23 మే, 2019 న ప్రారంభంకాగా, పూర్తి ఫలితాలు 24 మే, 2019 నాటికి విడుదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి ఆధిక్యతతో అనగా 175 సీట్లలో 151 గెలిచి విజయం సాధించింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో పూర్తిగా గెలిచింది. రాయలసీమ లో మూడు సీట్లు తప్ప అన్నీ గెలిచింది. తెలుగు దేశం పార్టీ 23 సీట్లకు చరిత్రలో అత్యంత తక్కువ స్థానాలకు పరిమితమైంది. మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చనాయుడు మాత్రమే గెలుపొందారు. జనసేన కూటమి రాజోలు స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాలు రెంటిలో ఓటమి చవిచూచాడు. జాతీయ పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లకు ఒక్క సీటుకూడా సాధించలేక పోయాయి.

                                     

13. ఎన్నికల విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జాతీయ పార్టీలు ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం పెరిగింది. జనసేన కూటమి ప్రత్యక్షంగా పోటీ చేయడం, బిజేపీకూడా నేరుగా పోటీ చేయడంతో చాలా చోట్ల బహుకోణపు పోటీలైనా, ప్రధాన పోటీ టీడిపి, వైసిపీ మధ్యనే నడిచింది. జనసేన కూటమి కాపు వర్గపు వోట్లను చీల్చడంతో పాటు, టీడిపీకి వ్యతిరేక ప్రచారం, వైసిపీకి కలిసొచ్చింది.

                                     

13.1. ఎన్నికల విశ్లేషణ డబ్బు పంపిణి

ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీగా డబ్బు వెచ్చించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సీఎంఎస్ విశ్లేషణ నివేదిక పేర్కొంది. ఓటుకు 1000 నుండి 2000 వరకు సగం పైగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని తెలిపింది.

                                     

13.2. ఎన్నికల విశ్లేషణ ఎన్నికైన ఎమ్మెల్యేల నేపథ్యం, ఆస్తులు,విద్య

174 ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలను పరిశీలించితే 96 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఎన్నికైన ఎమ్మెల్యేలలో 163 మంది 94 శాతం కోటీశ్వరులున్నారు. సగటున ఒక్కో ఎమ్మెల్యే రూ.27. 87 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అధికంగా ఆస్తులు గల మొదటి మూడు స్థానాలలో చంద్రబాబు, ఆస్తుల విలువ రూ.668 కోట్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 510 కోట్లు, నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ రూ. 274 కోట్లు నిలిచారు. అతితక్కువ ఆస్తులు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కి 6 లక్షల 75 వేల రూపాయల విలువైన ఆస్తులు వున్నాయి. 2014లో గెలిచి, 2019లో మళ్లీ ఎన్నికైన 55 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సగటున 60 శాతం పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది. ఆదాయపు పన్ను నివేదికల ప్రకారం అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన 2017- 18 ఆర్థిక సంవత్సరంలోరూ.25 కోట్లు ఆదాయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో వున్నారు. చంద్రబాబు నాయుడు 2017-18 ఆర్ధిక సంవత్సరానికి తన వార్షిక ఆదాయం రూ.64.7 లక్షలుగా వుందని తెలిపాడు. 59 మంది ఎమ్మెల్యేలు తమ విద్యార్హతలను 5 నుంచి 12 తరగతి వరకు ఉండగా, 112 మంది తాము డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివారు. ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యుడనని ప్రకటించారు.

                                     

14. ఇవి కూడా చూడండి

 • ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2019
 • 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు
 • ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014
 • ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2014