Топ-100
Back

ⓘ నిజాం పాలనలో విద్య-విజ్ఞానం-సంస్కృతి. హైదరాబాద్ లోని పాఠశాలలను, కళాశాలలను హైదరాబాద్ ప్రభుత్వమే నడిపించేది. విద్యావ్యవస్థపై ప్రభుత్వ గుత్తాధికారం ఉండడమేకాకుండా, ..
                                     

ⓘ నిజాం పాలనలో విద్య-విజ్ఞానం-సంస్కృతి

హైదరాబాద్ లోని పాఠశాలలను, కళాశాలలను హైదరాబాద్ ప్రభుత్వమే నడిపించేది. విద్యావ్యవస్థపై ప్రభుత్వ గుత్తాధికారం ఉండడమేకాకుండా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభివృద్ధి చాలా తక్కువగా ఉండేది. ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో చాలా తక్కువగా ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపబడుతుండేవి.

అంతకుముందున్న పాఠశాలల్లో చినబాలశిక్ష, పెద్ద బాలశిక్ష, ఉత్తరాలు చదువు నేర్పే పాతకాలపు ప్రాథమిక శిక్షణ చాలాభాగం నడిచింది. శతకాల్లోని భాగవతంలోని పద్యాలను నేర్పటం ఈ శిక్షణలో భాగంగా ఉంటుంది. బడి పుస్తకాలు ఉన్నప్పటికీ సామాన్యులు కోరే ఈ శిక్షణను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయలు కాదనలేకపోయారు.

ప్రారంభంలో ఉర్దూలో విద్యాభ్యాసం ఉండేది. అయితే, కింది తరగతులలో తెలుగు పాఠాలనే బోధించారు. కొన్నిరోజుల తరువాత క్రమంగా మొదటి తరగతి నుంచే ఉర్దూలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. తెలుగును రెండవ భాషగా మార్చారు. మొదట్లో ఉర్దూ పాఠ్యపుస్తకాలు ఉత్తర హిందూస్థాన్ నుండి తెప్పించేవారు. కానీ, ఇందులో ఉపయోగించిన భాష కఠినంగా ఉండడంవల్ల తెలుగు విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవటం అతికష్టంగా ఉండేది. దాంతో నిజాం సంస్థానంలోనే సులువైన ఉర్దూ భాషలో పాఠ్య పుస్తకాలను తయారుచేయడం ప్రారంభించారు.

ముస్లిం చక్రవర్తుల రాజుల, వారి ప్రధానుల, వారి దర్బారుల్లోని విద్యావంతుల వర్ణనలే ఎక్కువగా ఉండేవి. ముస్లిం రాజులు హిందూ రాజులపై విజయాలు సాధించి వారిని ఓడించిన ఘట్టాలను సవివరంగా రాయడంతోపాటు ఇస్లాం మతాన్ని బోధించే పాఠాలు ఉండేవి. కాని తెలుగువారి రాజ్యాలను, జీవిత వరిస్థితులను గురించి ఎక్కడా రాసేవారుకాదు. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల తరగతుల్లో "దక్కను చరిత్ర ను చెప్పేవారు. ఇది ప్రధానంగా నిజాం నవాబు, అతని పూర్వీకుల చరిత్రరూపంలో ఉండేది. హైదరాబాదు సంస్థానపు "భూగోళం" బోధనాంశంగా ఉండేది. సామాన్య గణితం, సైన్సు వంటి కోర్సుల తరగతులు ఉర్దూ భాషలోనే బోధించబడేవి.

హైస్కూలు, కాలేజీ పాఠ్య పుస్తకాలన్నీంటిని తర్జమా చేయించారు. వీటిల్లో వాడిన ఉర్దూ భాష పార్శీ, అరబ్బీమయంగా ఉండడంతో విద్యార్థులకు వాటిలోని విషయంతోపాటు భాషను కూడా అర్థంచేసుకోవటం కష్టంగా ఉండేది. వాటి ఇంగ్లీష్ మూల గ్రంథాలు సులభంగా అర్థమయ్యేవి. ఇంగ్లీషు భాషకు సంబంధించిన పుస్తకాలను ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకునేవారు. ఉర్దూ భారతదేశపు అధికారిక భాషల్లో ఒకటి. బ్రిటిషువారి తోడ్పాటుతో నిజాం ప్రభుత్వం ఉర్దూను విశ్వవిద్యాలయ స్థాయివరకు బోధనాభాషగా చేసి అమలు జరిపింది.

సంస్థాన ప్రజల మాతృభాషలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు అయినప్పటికీ వీటికి ప్రత్యామ్నాయంగా ఉర్దూను ప్రవేశపెట్టిన నిజాం ప్రభుత్వం పరాయి భాషాధిపత్యాన్ని ప్రజలపై రుద్దింది. దీని ఫలితంగా తెలుగువారిలో విద్యావ్యాప్తి తగ్గిపోయింది. పేద మధ్యతరగతి రైతుబిడ్డలు స్కూళ్ళల్లో చదవడమే అరుదుగా ఉండేది. సమాజంలోని అసమానతతోపాటు పేదరికం కూడా వారి చదువుకు అడ్డువచ్చేది. ధనిక రైతు కుటుంబాల విద్యార్థలు తమ గ్రామంలోని స్కూల్లో రెండవ తరగతి నుంచి నాల్గవ తరగతి వరకు చదివి తరువాత వ్యవసాయ వృత్తిలో ప్రవేశించేవారు. భూస్వాముల బిడ్డలు బస్తీలకు వెళ్ళి మిడిల్ స్కూళ్ళలో, హైస్కూళ్ళలో చదివేవారు. అక్కడక్కడా గ్రామీణ రైతుకుటుంబాల నుంచి వ్యక్తులు స్కూళ్ళలో చేరి చదువుకునేవారు. పట్టణాల్లోని అన్ని తరగతులవారూ తమ బిడ్డలను స్కూళ్ళకు పంపించి తమ శక్తికొలదీ చదివించేవారు. ఈమేరకు భూస్వాములు, ధనవంతులకే గాక మధ్యతరగతి వారికి కూడా చదువు అందుబాటులో ఉండేది. ఉద్యోగాలు చేసుకొనేవారంతా తమ బిడ్డలను చదివించేవారు, సంపన్నులకు ఇబ్బంది ఉండేదికాదు.

స్కూల్లో, కాలేజీలో చేరిననాటినుండి ఉద్యోగంలో ప్రవేశించే రోజుకోసం నిరీక్షించేవారు ఉండడంతో ఉద్యమాలు అభివృద్ధి కాలేదు. తమతమ భాషా సంస్కృతులను అభిమానిస్తే దానిని ప్రభుత్వ వ్యతిరేకతగా పరిగణించే రోజులవి. ఆయినా భాషాభిమానంగల విద్యార్థలు తమ విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగులయ్యారు. 1940 వరకు ఇది కొనసాగింది.

                                     

1.1. విజ్ఞానం గ్రంథాలయాలు

ఆంధ్ర ఉద్యమం మొదలవ్వకముందే తెలుగు భాషాభిమానులు హైదరాబాదు లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 1901, హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషానిలయం 1904 లను స్థాపించారు. ఆప్పటినుంచి వివిధ జిల్లా తాలూకా, ముఖ్య గ్రామ కేంద్రాల్లో గ్రంథాలయాలు ప్రారంభించబడ్డాయి. వీటికి రాజుల, మహారాజుల పేర్ల పెట్టటమేగాక ఆనాటి జమీందారులు, సంస్థానాధీశులు, జాగీర్దారులు ఆర్థికసాయం చేశారు.

                                     

1.2. విజ్ఞానం పత్రికలు - సాహిత్య కృషి

తెలుగు పత్రికల సంఖ్య చాలా తక్కువగా ఉండేవి.

  • తెలుగు పత్రిక: ఇది 1922లో వెలువడింది. ఇది ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు సోదరుల సంపాదకత్వాన వెలువడి సుమారు 5 సంవత్సరాలు నడిచి ఆగిపోయింది. వీరు మానుకోట మహబూబాబాద్‌ తాలూకాలో ఇనుగుర్తి గ్రామానికి చెందినవారు. వీరు ఈ పత్రికను నడుపడమేకాకుండా కొన్ని పుస్తకాలను రచించి ప్రచురించారు.
  • నీలగిరి పత్రిక: నల్లగొండ నుండి 1922 లో వెలువడిన ఈ పత్రిక సుమారు 5 సంవత్సరాలపాటు నడిచి ఆగిపోయింది. నల్లగొండను సంస్కృతంలో నీలగిరి అనేవారు. ఈ పత్రికలో గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమానికి సంబంధించిన వార్తలు, వ్యాసాలు వచ్చేవి. దీనికి షబ్నవీసు వెంకట రామనరసింహారావు సంపాదకులు.
  • గోలకొండ పత్రిక: ఇది సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో 1926లో వెలువడింది. ఈ పత్రిక కేంద్రస్థానం హైదరాబాదు. ముందు వారపత్రికగా మొదలై, తరువాత ద్వైవారపత్రిక రూపంలో వెలువడింది. ఆ కాలపు రైతుల ఇబ్బందులను గురించి, సంఘ సంస్కరణ సమస్యలు, సాహిత్యం, పరిశోధనలు మొదలగు సమస్యలపై వ్యాసాలను, అప్పడప్పుడు భూస్వాముల అక్రమాల వార్తలను కూడా ప్రచురించేవారు. ఆంధ్రోద్యమ ప్రచారానికి ఈ పత్రిక ఎంతో ఉపయోగపడింది. ఈ పత్రికకు ప్రభుత్వపు ఉన్నత ఉద్యోగాలలో ఉండే రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి పోలీసు శాఖ, పింగళి వెంకట రామారెడ్డి న్యాయశాఖ లాంటి పెద్దల మద్దతు ఉండేది. సురవరం ప్రతాపరెడ్డి "గోలకొండ కవుల సంచిక" అను ఒక కవితా సంకలనాన్ని ప్రకటించారు. తెలంగాణాలో కూడా కవులు ఉన్నారని, వారికి ఎలాంటి ప్రోత్సాహంలేక కాలగర్భంలో దాగి ఉన్నారనీ ఈ సంచిక ద్వారా రుజువుచేశారు. ఈ సంచిక ద్వారా లెక్కలోకి వచ్చినవారు 188 మంది పూర్వకవులు, 854 మంది ఆధునికులున్నట్టు మద్దసాని రాంరెడ్డి రాసిన ప్రతాపరెడ్డి జీవిత చరిత్రలో పేర్కొన్నారు.
                                     

2. సంస్కృతి

తెలుగు వారి అనేక గ్రామాల పేర్లను నిజాం పాలనలో వారికి అనుగుణంగా మార్చుకున్నారు. ప్రజలందరి నాలుకలపై ఉండే పట్టణాల, గ్రామాల పేర్లను మార్చి వక్రీకరించటం అనేది తెలుగు సంస్కృతిని అణచివేయటానికి ప్రయత్నంలో ఒక భాగమని చెప్పొచ్చు.

  • పండుగలు - కళారూపాలు: బతుకమ్మ పండగ, కాముని పండగ, హోలీ పండుగ, మొహర్రం పండుగ దసరా, ఉగాది, సంక్రాంతి, దీపావళి పండుగల్లో అన్ని వర్గాలవారూ పాల్గొనటం అనేది సహజంగా ఉండేది. ప్రజల్లో రాజకీయ సాంఘిక చైతన్యాన్ని కలిగించటానికి ఈ కళా రూపాలను ఉపయోగించగల సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు ఆ రోజుల్లో లేవు.